
సతారా, ఫిబ్రవరి 17: ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలు మొత్తం విద్యార్ధులకు పరీక్షలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. కానీ రోడ్డు మీదకొస్తే బారులు తీరిన ట్రాఫిక్ దర్శనం ఇస్తుంది. దీంతో కొందరు విద్యార్ధులు టైంకి పరీక్ష కేంద్రాలకు చేరుకోలేక అవస్థలు పడుతున్నారు. తాజాగా ఓ విద్యార్ధికి ఇటువంటి సంకటం ఎందురైంది. అయితే కూర్చుని బాధపడకుండా పారాగ్లైడింగ్ సాయంతో మెరుపువేగంతో గాల్లో తేలుకుంటూ పరీక్ష కేంద్రంలో వాలిపోయాడు. ఈ విచిత్ర ఘటన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే..
మహారాష్ట్రలోని సతారా జిల్లా వాయ్ తాలూకాలోని పసరాని గ్రామానికి చెందిన సమర్త్ మహాంగడే అనే విద్యార్థికి మరికొన్ని నిమిషాల్లో పరీక్ష ప్రారంభం కానుంది. పరీక్ష రాయడానికి కాలేజీకి బయలు దేరిన అతడికి వాయి-పంచగని రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్ కనిపించింది. రోడ్డుపై ఎంతకూ కదలని ట్రాఫిక్‌లో చిక్కుకున్నానని గ్రహించిన ఆ విద్యార్థి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే సాహస క్రీడల నిపుణుడైన గోవింద్ యెవాలె సాయం కోరాడు. ఆయన అంగీకరించడంతో నిపుణుడి సాయంతో పారాగ్లైడింగ్ దుస్తులు వేసుకొని, కాలేజీ బ్యాగును భుజాన వేసుకొని గాల్లో ఎగురుకుంటూ కాలేజీకి చేరుకున్నాడు. దీంతో సకాలంలో పరీక్షకు హాజరయ్యాడు. ఈ ఇందుకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి, సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా నెటిజన్లు షాక్‌కు గురయ్యారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతూ నెట్టింట హల్ చల్ చేస్తున్నారు.
సాధారణంగా అందమైన ప్రకృతి దృశ్యాల వీక్షించేందుకు టూరిస్టులు కొందరు పారాగ్లైడింగ్ చేస్తుంటారు. కానీ దీనిని కూడా చివరి నిమిషంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవడానికి ఉపయోగించుకుంటారని ఇంత వరకూ ఎవరూ ఊహించి ఉండరు కదా?
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.