
పుణ్యక్షేత్రాల్లో కొద్ది రోజులుగా చిరుత పులులు కలకలం రేపుతున్నాయి. వనం దాటి జనంలోకి వస్తున్నాయి. భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. మొన్నటి వరకు తిరుమలలో భక్తులను చిరుత పులులు వణికించాయి. టీటీడీ అధికారులు పకడ్బంధీ చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు శ్రీశైలం వంతు వచ్చింది. శ్రీశైలం శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపింది.
పాతాళగంగ మెట్లవైపు ఉన్న ఓ ఇంటి ప్రాంగణంలోకి గురువారం అర్ధరాత్రి చిరుత వచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇవి వైరల్ అవుతున్నాయి. శ్రీశైలం పుణ్యక్షేత్రం నల్లమల అటవీ ప్రాంతంలో ఉండటంతో తరచూ ఇక్కడ వన్యమృగాలు సంచరిస్తుండటం కామనై పోయింది. అయితే ఇప్పుడు చిరుత ఏకంగా ఇంటిలోకి ప్రవేశించడం సంచలనంగా మారింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతాళగంగ మెట్లవైపు సత్యనారాయణ అనే వ్యక్తి రేకుల షెడ్డుతో ఇల్లు నిర్మించుకున్నారు. అక్కడ చిరుతపులి సంచారం ఉండడంతో అప్రమత్తతలో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. సత్యనారాయణ ఇంటికి చిరుత పులి రావడం ఇది రెండోసారి. కృష్ణానది తీరం, శివారు ప్రాంతం కావడంతో అక్కడ తరచూ సంచరిస్తున్నాయి.
ఈవో శ్రీనివాసరావు, దేవస్థానం సిబ్బంది అలర్ట్ అయ్యారు. పాతాళగంగకు పుణ్య స్నానాలకు వెళ్ళే భక్తులు, స్థానికులు జాగ్రత్తలు పాటించాలని మైకుల ద్వారా అధికారులు చాటింపు వేయించారు.