Viral Video: కేరళ సముద్ర తీరంలో డేంజర్‌ బెల్…! మునిగిపోయిన ఆ కంటైనర్‌ షిప్పులో ఏముంది?

కేరళ కోచి తీరంలో రెడ్ అలర్ట్. అక్కడి సముద్ర జలాలు విషతుల్యం కాబోతున్నాయి. సముద్ర జీవుల మనుగడే ప్రశ్నార్థకం కాబోతోంది. కారణం..ఓ ఓడ. శనివారం సాయంత్రం లెబీరియాకు చెందిన ఓభారీ నౌక మునిగిపోయింది. ఆనౌకలో ఉన్న కంటైనర్లన్నీ సముద్రంలో మునిగిపోయాయి. ఇప్పుడు ఆందోళన మునిగిన ఓడగురించో..లేక కంటైనర్ల మునిగడంతో వచ్చిన నష్టం కాదు..కంటైనర్లలో ఉన్న ప్రమాదకరమైన రసాయనాలు సముద్రంలో...

Viral Video: కేరళ సముద్ర తీరంలో డేంజర్‌ బెల్...! మునిగిపోయిన ఆ కంటైనర్‌ షిప్పులో ఏముంది?
Corgo Ship Accident

Updated on: May 26, 2025 | 3:33 PM

కేరళ కోచి తీరంలో రెడ్ అలర్ట్. అక్కడి సముద్ర జలాలు విషతుల్యం కాబోతున్నాయి. సముద్ర జీవుల మనుగడే ప్రశ్నార్థకం కాబోతోంది. కారణం..ఓ ఓడ. శనివారం సాయంత్రం లెబీరియాకు చెందిన ఓభారీ నౌక మునిగిపోయింది. ఆనౌకలో ఉన్న కంటైనర్లన్నీ సముద్రంలో మునిగిపోయాయి. ఇప్పుడు ఆందోళన మునిగిన ఓడగురించో..లేక కంటైనర్ల మునిగడంతో వచ్చిన నష్టం కాదు..కంటైనర్లలో ఉన్న ప్రమాదకరమైన రసాయనాలు సముద్రంలో కలిశాయి. ఆరసాయనాలు ఎంతమోతాదులో సముద్రజలాలను విషతుల్యం చేశాయో ఇంకా తెలియరాలేదు కానీ…ప్రమాదం మాత్రం ఊహించనంత ఉండబోతోందన్న టెన్షన్ పట్టుకుంది కేరళ తీరప్రాంతవాసులకు. అటు అధికారులకు. కేంద్ర రాష్ట్రప్రభుత్వాలకు…ఇంతకూ భయపడేంత డేంజర్ కెమికల్ ఆ ఓడలో ఏముంది…?

లైబీరియాకు చెందిన MSC ELSA 3 కార్గో నౌక…శనివారం సాయంత్రం కొచ్చికి రావాల్సి ఉంది. అయితే నిన్న సాయంత్రం వాతావరణం అత్యంత ప్రమాదకరంగా ఉంది. అరేబియా సముద్రంలో భారీ తుఫాను, ఈదురుగాలులు ఆఓడను చుట్టుముట్టాయి. కొచ్చికి 38నాటికల్ మైళ్లదూరంలో ఓడ భయంకరమైన తుఫానులో చిక్కుకుపోయింది. సాయంత్రం 4.30గంటలకు ఒక్కసారిగా ఈదురుగాలుల తీవ్రతకు ఓ పక్కకు ఒరిగిపోయింది. వెంటనే నౌక సిబ్బంది మన ఇండియన్ కోస్ట్‌గార్డ్స్‌కు సమాచారం అందించారు. వెంటనే అలర్ట్ అయిన మన కోస్ట్‌గార్డ్ INSసుజాతతో ఓడలోని సిబ్బందిలో 18మందిని రక్షించి..తీరప్రాంతానికి తీసుకొచ్చింది. ఇంకా ముగ్గురు షిప్‌లోనే చిక్కుకుపోయారు. బలమైన ఈదురుగాలలకు రెస్క్యూ ఆపరేషన్‌కు తీవ్ర అడ్డంకిగా మారాయి. ఈదురుగాలలుకు షిప్‌లోని కంటైనర్లు ఒక్కొక్కటిగా సముద్రంలో పడసాగాయి. రాత్రి 9గంటలకు ఓడ పూర్తిగా సముద్రంలో మునిగిపోయే పరిస్థితికొచ్చింది. దీంతో మిగతా ముగ్గురిని అతికష్టం మీద ఇండియన్ కోస్ట్‌గార్డ్స్ రక్షించగలిగారు. రాత్రి 11గంటల వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. మొత్తం ఓడలో 24మంది సిబ్బంది ఉన్నారు.

ఓడ మునిగిపోవడానికి ప్రధాన కారణం వాతావరణ పరిస్థితులేనని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రతరమై, గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఈ పరిస్థితుల్లో ఓడ సిబ్బంది నియంత్రణ కోల్పోయారు. ఓడలో ఉన్న 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్, 367.1 మెట్రిక్ టన్నుల ఫర్నేస్ ఆయిల్ సముద్రంలో పడిపోయింది. కార్గో నౌకలో మొత్తం 640 కంటైనర్లు ఉన్నాయి. అందులో 13కంటైనర్లలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయి. వీటిలో 12కంటైనర్లలో కాల్షియం కార్బైడ్‌ ఉంది. రెస్క్యూ ఆపరేషన్స్ రక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సముద్రంలో చెల్లాచెదురుగా ఉన్న కంటైనర్లను సేకరించేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు.

కంటైనర్లలోని ప్రమాదకర రసాయనాల్లో కాల్షియం కార్బైడ్ ప్రధానమైనది. ఇది నీటితో కలిసినప్పుడు అసిటిలీన్ వాయువును విడుదల చేస్తుంది, ఇది అత్యంత మండే స్వభావం గలది. అసిటిలీన్ గాలిలో ఉన్నప్పుడు పేలుడు సంభవించే అవకాశం ఉంది. కొన్ని రకాల చేపలు, పగడాలు చనిపోయే ప్రమాదం ఉంది. ఈ రసాయనం తీరప్రాంత గ్రామాలకు వ్యాపిస్తే..స్థానికులకు శ్వాసకోశ సమస్యలు, చర్మ వ్యాధులు సంభవించవచ్చు. మిగిలిన కంటైనర్‌లోని రసాయనం గురించి కచ్చితమైన వివరాలు లేనప్పటికీ, అది కూడా పర్యావరణానికి హానికరమైనదని అధికారులు ధ్రువీకరించారు.కంటైనర్లు మునిగిపోవడంతో…సముద్రాన్ని శుద్ది చేయడం కష్టంగా మారింది. రసాయనాలు నీటితో కలిస్తే సముద్ర జీవులు చనిపోయే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.ఓడ మునిగిపోవడంతో నష్టం తీవ్రంగా ఉంటుందని అంచనా. ప్రాథమిక అంచనాల ప్రకారం, ఓడ, కంటైనర్ల నష్టం, రసాయన కాలుష్య శుద్ధికి సుమారు 500 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని నిపుణులు తెలిపారు. సముద్రంలో లీకైన డీజిల్, ఫర్నేస్ ఆయిల్ వల్ల మత్స్య సంపదపై దీర్ఘకాలిక ప్రభావం ఉంటుంది.

ఓడ మునిగిన ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచారణకు ఆదేశించాయి. ఓడ నిర్వహణలో లోపాలు, రసాయన కంటైనర్ల భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వంటి అంశాలపై విచారణ చేయనున్నారు. కేరళ తీరంలో ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు.ప్రస్తుతం తీరప్రాంత గ్రామాల్లో హెచ్చరికలు జారీ చేసారు. జనం కంటైనర్లను తాకకుండా ఉండాలని సూచించారు.

వీడియో చూడండి: