ప్రస్తుతం దేశవ్యాప్తంగా రీల్స్ కున్న క్రేజ్ అంతా ఇంతాకాదు. లైక్, వ్యూస్ కోసం పడరాని పాట్లు పడుతున్నారు. సోషల్ మీడియాలో ఓవర్‌నైట్ స్టార్లు అయిపోవడానికి ప్రాణాలకు సైతం తెగించి ప్రమాదకర స్టంట్లు చేస్తూ కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. కొందరు యువత చదువును సైతం పక్కన పెట్టి రీల్స్ తయారీపై బిజీ అయిపోయారు. స్మార్ట్ ఫోన్లు చేతిలోకొచ్చాక చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ వీటి మాయలో పడిపోయారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవడానికి ఎంతకైనా దిగడానికి సిద్ధమైపోతున్నారు. తాజాగా ఓ బాలిక రీల్స్ చేస్తూ ఆరో అంతస్తు నుంచి అమాంతం కింద పడిపోయింది. ప్రమాదం దాటికి ఒంట్లో ఎముకలు ఫట్ ఫట్ మంటూ విరగడంతో బాధతో విలవిల లాడింది. ఈ షాకింగ్ ఘటన ఘజియాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఘజియాబాద్‌లోని ఇందిరాపురం ప్రాంతంలో ఉన్న క్లౌడ్-9 సొసైటీలో మోనిషా (16) అనే బాలిక తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేస్తూ అపార్ట్‌మెంట్ ఆరో అంతస్తులోని బాల్కనీలో నిలబడి, చేతిలో ఫోన్ పట్టుకుని డ్యాన్స్ చేయసాగింది. ఇంతలో చేతిలో మొబైల్ జారిపోయింది. ఫోన్ పట్టుకునే ప్రయత్నంలో బాల్కనీ నుంచి బాలిక కిందపడి తీవ్ర గాయాలపాలైంది. అంత ఎత్తు నుంచి కింద పడిపోవడంతో బాలిక ఒంట్లో ఎముకలు విరిగపోయాయి. దీంతో నొప్పితో ఏడుస్తూ ఆర్తనాదాలు చేయసాగాయి. గమనించిన ఇరుగు పొరుగు వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉంది. యువతి కింద పడిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో నేలపై పడిపోయిన బాలికని కొందరు ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు పైకి లేపడంతో, ఆమె నొప్పితో కేకలు వేయడం చూడొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనూ చుట్టూ ఉన్నవారి కామెంట్లు మరింత షాక్‌కు గురిచేస్తున్నాయి. ‘ఈ అమ్మాయి తన తల్లిదండ్రుల మాట అస్సలు వినదు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ, వారి పరువు మొత్తం తీస్తుందంటూ తిట్టిపోయడం’ వీడియోలో వినొచ్చు.
అంత ఎత్తునుంచి కింద పడిపోవడం వల్ల ఆమె కాలు విరిగిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా ఇప్పటికే పలు సందర్భాల్లో యువత ప్రమాదకర రీతిలో రీల్స్ చేస్తూ ప్రాణాలు పొగొట్టుకున్న ఎన్నో సంఘనలు విన్నాం. మరికొందరు ఎత్తైన ప్రదేశాల నుంచి కిందపడిపోయి ఆసుపత్రి పాలైన వాళ్ల కథనాలు చాలానే చూశాం. సోషల్ మీడియాలో షేర్ చేసే వీడియోల ద్వారా పొందే క్షణికానందానికి తమ ప్రాణాలను పణంగా పెట్టడం సరికాదంటూ నెటిజన్లు హితవు పలుకుతున్నారు.