
దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలును ఒక పాత డీజిల్ లోకోమోటివ్ లాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఇది ఆశ్చర్యపరిచే దృశ్యం అయినప్పటికీ, దీని వెనుక ఉన్న కారణం కూడా అంతే ఆశ్చర్యకరంగా ఉంది. నివేదికల ప్రకారం, ఈ అరుదైన దృశ్యం ఒక రైల్వే ట్రాక్‌పై చిత్రీకరించబడింది. అందులో సాంప్రదాయ పాత డీజిల్ ఇంజన్ చాలా నెమ్మదిగా వందే భారత్ రైలును లాక్కుంటూ వెళ్తోంది. దేశవ్యాప్తంగా ఇండియన్ రైల్వేస్ వేగంగా విద్యుద్దీకరణ (Electrification) వైపు అడుగులు వేస్తున్న తరుణంలో, ఇలాంటి సరికొత్త బుల్లెట్ స్టైల్ రైలును పాతకాలపు డీజిల్ ఇంజన్‌తో లాగించడం నెటిజన్లను ఆకర్షించింది. ఈ వీడియో క్లిప్ ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) వంటి వేదికలపై క్షణాల్లో వైరల్‌గా మారింది.
ఈ దృశ్యం చూసి చాలా మంది నెటిజన్లు వందే భారత్ రైలు నాణ్యతపై జోకులు పేలుస్తుండగా, రైల్వే నిపుణులు దీని వెనుక ఉన్న సాంకేతిక కారణాలను వివరిస్తున్నారు. వందే భారత్ పూర్తిగా విద్యుత్‌పై నడిచే రైలు. ప్రయాణ సమయంలో ఎక్కడైనా ఓవర్‌హెడ్ ఎక్విప్‌మెంట్ (OHE) వైర్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయినా, లేదా రైలులో ఏదైనా పెద్ద సాంకేతిక లోపం తలెత్తినా రైలు ట్రాక్‌పైనే ఆగిపోతుంది. అలాంటి అత్యవసర సమయాల్లో రూట్‌ను క్లియర్ చేయడానికి, రైలును సమీపంలోని యార్డ్ లేదా స్టేషన్‌కు తరలించడానికి డీజిల్ లోకోమోటివ్ ఇంజన్ల (Rescue Engines) సహాయం తీసుకుంటారు.
the_rail_town అనే ఫేస్‌బుక్ ఖాతా షేర్ చేసిన ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. చాలా మంది లైక్ కూడా చేశారు. ఈ వీడియోపై సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎంత ఆధునిక సాంకేతికత వచ్చినా, ముసలివాళ్ల అనుభవమే రక్షిస్తుంది అని ఒకరు కామెంట్ చేయగా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఇదే అని మరొకరు రాసుకొచ్చారు. ఒక వినియోగదారు తండ్రి ఎప్పటికీ తండ్రే అని పోల్చుతూ రాశారు. మరికొందరు వందే భారత్‌కు కూడా విశ్రాంతి అవసరమే కదా! అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ, అత్యున్నత సాంకేతికత కలిగిన రైలును, భారతీయ రైల్వేకి దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న పాత డీజిల్ ఇంజన్ రక్షించడం ఒక ఆసక్తికరమైన దృశ్యంగా మిగిలిపోయింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..