పిల్లలు అల్లరి చేస్తేనే అందం.. అయితే హద్దుమీరిన అల్లరి చేస్తే తలిదండ్రులకు కోపం వస్తుంది. ఒకొక్కసారి సహనం కోల్పోయి పిల్లలపై కోపం వచ్చి తిట్టడం లేదా కొట్టడం లాంటివి చేస్తారు. ఇక పిల్లలు తమ చేతిలో పెన్సిల్ లేదా కలర్స్ ఉంటె చాలు ఇంటి గోడల మీద రాయడం లేదా తమకు వచ్చిన బొమ్మలు గీయడం వంటివి చేస్తారు. అందమైన గోడను పిచ్చి గీతలతో పాడు చేసిన పిల్లలపై తల్లిదండ్రులకు కోపం వస్తే.. రకరకాల పనిష్మెంట్స్ ఇస్తారు. అయితే చైనాలోని ఓ 8 ఏళ్ల బాలుడు కూడా అలాంటిదే చేశాడు. స్కూల్ గోడపై ఓ స్కెచ్ గీశాడు. ఈ విషయం ఆ బాలుడి తండ్రి వద్దకు చేరుకుంది. దీంతో ఆ బాలుడు తండ్రి తన కొడుక్కి ఓ వింత శిక్ష విధించాడు. ఆ శిక్ష గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు.
ఈ ఘటన సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. బాలుడు తన పాఠశాల గోడపై కొన్ని స్కెచ్‌లు వేశాడని, ఆ తర్వాత పాఠశాల నిర్వాహకులు అతని తల్లిదండ్రులను పిలిచి ఈ సంఘటన గురించి చెప్పారు. అంతేకాదు బాలుడు చేసిన పనిపై తల్లిదండ్రులకు టీచర్స్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తన కొడుకు చేసిన పని గురించి తెలుసుకున్న ఆ తండ్రి.. ఈ చిన్న తప్పుకి అద్వితీయమైన శిక్ష వేయాలని నిర్ణయించుకున్నాడు. తన కొడుకును గిటార్‌తో రోడ్డుపై కూర్చోబెట్టాడు. గిటార్ ప్లే చేసి డబ్బులు సంపాదించమని.. అలా వచ్చిన డబ్బులతో తిరిగి స్కూల్ గోడలకు రంగు వేయించి.. పాఠశాలకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయమని పెదరాయుడి రేంజ్ లో తీర్పు ఇచ్చాడు.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం పిల్లవాడు వరుసగా మూడు రోజులు వీధుల్లో గిటార్ వాయించాడు. పాటలు కూడా పాడాడు. ఇలా రోడ్డు పక్కన కుర్చుని ఉన్న బాలుడి చేతిలో గిటార్ తో పాటు .. ఒక సైన్ బోర్డ్ కూడా ఉంది. ‘నేను పాఠశాల గోడను పాడు చేశాను.. ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి నేను 300 యువాన్లు (దాదాపు రూ. 3686) సంపాదించాలి’ అని రాసి ఉంది.
బాలుడి తండ్రి స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇటీవల పునరుద్ధరించిన పాఠశాల గోడపై తన కొడుకు చిత్రాలు గీశాడు. స్కూల్ యాజమాన్యం ఈ విషయం గురించి తనకు ఫిర్యాదు చేసింది. అప్పుడు తాను తన కొడుకు చేసిన తప్పుని తెలియజేస్తూ.. కొడుకు ద్వారానే నష్టపరిహారం వసూలు చేయాలని తాను నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. ఇలా స్ట్రీట్ లో ప్రదర్శన ఇచ్చి సంపాదించడం వలన కొడుకుకి బాధ్యత తెలుస్తుందని.. జీవిత పాఠాలు నేర్చుకుంటాడని తాను ఆశిస్తున్నానని చెప్పాడు. అంతేకాదు ఆ బాలుడి తండ్రి ఇంకా మాట్లాడుతూ, ‘తన కొడుకు వరుసగా మూడు రోజులు ప్రతిరోజూ ఒక గంట ప్రదర్శన ఇచ్చాడు, నష్టపరిహారం చెల్లించడానికి తగినంత సంపాదించాడని వెల్లడించాడు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..