ఈ మధ్యకాలంలో దేశం నలమూలల ఎన్నో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. కొద్దిరోజుల క్రితం కాలికి ట్యాగ్, వీపుపై ట్రాన్స్‌మిటర్‌తో రాబందు కనిపించిన సంగతి తెలిసిందే. ఇలాంటి వింత సంఘటనే ఒకటి తాజాగా మహారాష్ట్రలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ రైతు పొలంలో ఆకాశం నుంచి బెలూన్ లాంటి ఒక వస్తువు ఊడిపడింది. కొరియన్ భాషలో రాసిన అక్షరాలు ఆ మర్మమైన పరికరంపై ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఇది స్థానికంగా వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని చిఖాలీ తాలూకా అంచర్‌వాడిలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. ఆకాశం నుంచి పడిన బెలూన్ లాంటి వస్తువును చూసి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. డిసెంబర్ 2వ తేదీ సోమవారం అంచర్‌వాడిలోని రెహష్ పొలంలో ఈ బెలూన్‌లాంటి వస్తువు ఆకాశం నుంచి ఊడిపడింది. సదరు రైతు ఎప్పటిలాగే తన పొలం పనుల కోసం రాగా.. ఈ మర్మమైన వస్తువును చూసి షాకయ్యాడు.
నిశితంగా పరిశీలించి చూడగా.. ఆ బెలూన్ లాంటి వస్తువుపై కొరియన్ అక్షరాలతో ఏదో రాసి ఉన్నట్టు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అనంతరం పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సదరు పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరికరం ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
సదరు పరికరం ఏదైనా వాతావరణ సూచికకు సంబంధించినదిగా అధికారులు భావిస్తున్నారు. అసలు ఈ పరికరం ఇక్కడికి ఎలా వచ్చింది.? ఏం జరిగింది.? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఈ పరికరం చూసి స్థానికులు భయపడాల్సిన అవసరం లేదని నాగ్‌పూర్ ప్రాంతీయ వాతావరణ శాఖ తెలిపింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..