
పిల్లలు చెప్పిన మాట వినలేదంటే..ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తుంటారు తల్లిదండ్రులు. వారిని భయపెట్టేందుకు చీకటి గదిలో బంధిస్తుంటారు. క్యాండిల్‌తో కాల్చి భయపెడుతుంటారు. అలాగే, మరికొందరు బూచోడికి పట్టిస్తామని బెదిరిస్తారు. అయితే, ఓ తండ్రి తన 11ఏళ్ల కూతుర్ని భయపెట్టేందుకు బావిలోకి వేలాడదీశాడు.. కానీ, పాపం అదే నిజమైంది. అతని చేతుల్లోంచి పట్టుతప్పి చిన్నారి బావిలో పడిచనిపోయింది. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లా నుండి హృదయ విదారక వార్త వెలుగులోకి వచ్చింది. మిస్రిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగన్నాథ్‌పూర్ గ్రామంలో ఒక తాగుబోతు తండ్రి తన 11 ఏళ్ల కుమార్తెను బావిలో వేలాడదీసి భయపెట్టడానికి ప్రయత్నించాడు. అయితే, అతను పట్టు కోల్పోవటంతో ఆ అమ్మాయి బావిలో పడి చనిపోయింది. ఈ సంఘటన అక్టోబర్ 21వ తేదీ రాత్రి జరిగిందని మిస్రిక్ పోలీస్ స్టేషన్ పోలీసులు తెలిపారు.
స్టేషన్ హౌస్ ఆఫీసర్ అరవింద్ సింగ్ మాట్లాడుతూ, నిందితుడు శ్రవణ్ కుమార్ మద్యానికి బానిసగా మారాడని చెప్పాడు. అతను తాగి ఇంటికి వచ్చి తన కూతురు లక్ష్మిని భోజనం పెట్టమని అడిగాడు. అప్పటికీ వంట పూర్తి కాలేదని ఆమె చెప్పింది. దాంతో అతను కోపంతో ఊగిపోతూ..ఆమెను తాడుతో కట్టి బావిలోకి వెలాడదీశాడు. కానీ, దురదృష్టవశాత్తు అతని చేయి జారి కూతురు బావిలో పడిపోయింది. ఇది చూసిన తండ్రి ఆమెను కాపాడటానికి లోపలికి దూకాడు. కానీ, అప్పటికే ఆలస్యమైంది. ఇరుగుపొరుగు గుమిగూడారు. తండ్రీ కూతుర్ని అతి కష్టం మీద బయటకు లాగారు. కానీ, అప్పటికే ఆ అమ్మాయి చనిపోయింది.
పోలీసులు హత్య కేసు నమోదు చేసి శ్రవణ్‌ను అరెస్టు చేశారు. శ్రవణ్ భార్య ఆరు సంవత్సరాల క్రితం మరణించింది. ఆ తర్వాత, అతను మద్యానికి బానిసయ్యాడు. తాగిన మైకంలో తరచూ ఇంట్లో గొడవలు చేస్తుండేవాడని పోలీసు విచారణలో తేలింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..