రష్యాపై వందల డ్రోన్లతో దాడి.. చమురు రిఫైనరీని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ !

రాత్రి వేళ ఒక్కసారిగా రష్యా ఆకాశంలోకి వందలాది డ్రోన్లు దూసుకొచ్చాయి. రష్యాలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని భారీ డ్రోన్ దాడులు జరిపింది ఉక్రెయిన్. పేలుళ్లతో కొన్ని ప్రాంతాలు దద్దరిల్లాయి. దాడుల్లో ఇద్దరు మరణించగా పలువురు గాయపడ్డారని రష్యా అధికారులు తెలిపారు. కీలకమైన చమురు రిఫైనరీ, ప్రయాణికుల రైలు, పారిశ్రామిక కేంద్రాలు కూడా దెబ్బతిన్నాయి.

రష్యాపై వందల డ్రోన్లతో దాడి.. చమురు రిఫైనరీని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ !
Ukraine Drone Attacks Kill 2 In Russia, Damage Oil Refinery And Passenger Train

Updated on: Sep 25, 2026 | 5:28 PM

దాడుల్లో ఏకంగా 592 ఉక్రెయిన్ డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు ధ్వంసం చేశాయని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. అయితే ఇంత భారీ సంఖ్యలో డ్రోన్లను అడ్డుకున్నప్పటికీ.. కొన్ని డ్రోన్లు రక్షణ వ్యవస్థలను దాటి లక్ష్యాలను చేరుకున్నాయి.

చమురు రిఫైనరీపై దాడి

బెల్గొరోడ్ ప్రాంతంలో ఓ ట్రక్కును ఉక్రెయిన్ డ్రోన్ ఢీకొట్టినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఒక పౌరుడు మృతి చెందగా.. మరో వ్యక్తి గాయపడ్డాడు. మరోవైపు పెర్మ్ ప్రాంతంలో జరిగిన భారీ డ్రోన్ దాడిలో ఒక వ్యక్తి మరణించినట్లు ఆ ప్రాంత గవర్నర్ దిమిత్రి మహోనిన్ తెలిపారు. ఈ దాడుల్లో రష్యాలోని రోస్తోవ్ ప్రాంతంలోని నోవోషాఖ్టిన్స్క్ చమురు రిఫైనరీ కూడా దెబ్బతిన్నట్లు గవర్నర్ యూరి స్ల్యూసర్ తెలిపారు. ఆ ప్రాంతంలో సుమారు 50 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే రిఫైనరీలోని కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు.  రిఫైనరీ వద్ద ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.

రైలు పైనా దాడి

డ్రోన్ దాడుల ప్రభావం ప్రయాణికుల రైలుపైనా పడింది. రష్యాలోని పలు ప్రాంతాల్లో పారిశ్రామిక సదుపాయాలు కూడా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ఒకే రాత్రిలో ఇంత భారీ సంఖ్యలో డ్రోన్లు ప్రయోగించడంపై రష్యా అధికారులు అప్రమత్తమయ్యారు.

అసలు లక్ష్యం ఏంటి?

రష్యాలోని చమురు రిఫైనరీలు, పారిశ్రామిక కేంద్రాలు, రవాణా వ్యవస్థలు లక్ష్యంగా దాడులు జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు 592 డ్రోన్లను కూల్చివేశామని రష్యా చెబుతుండగా.. మరోవైపు కొన్ని డ్రోన్లు కీలక ప్రాంతాలను ఎలా చేరుకున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ దాడులతో రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న డ్రోన్ యుద్ధం మరింత తీవ్రంగా మారిన సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ దాడులకు సంబంధించి ఉక్రెయిన్ నుంచి పూర్తి స్థాయి అధికారిక స్పందన రావాల్సి ఉంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us