Viral: అద్భుతం చేసిన డాక్టర్లు.. ఆ చిట్టి తల్లికి మంచి భవిష్యత్తును ఇచ్చారు

పాపకు ఆరు నెలలు ఉన్నప్పుడు వెన్నుముక కాస్త వంగి ఉండటాన్ని తల్లి గమనించింది. ఎదిగే పిల్ల కదా.. తర్వాత నార్మల్ అవుతుందిలే అని భావించింది. కానీ పాప వయస్సు పెరుగుతున్న కొద్ది సమస్య తీవ్రమైంది. దీంతో బాలిక భవిష్యత్‌పై తల్లిదండ్రులకు ఆందోళన మొదలైంది.

Viral: అద్భుతం చేసిన డాక్టర్లు.. ఆ చిట్టి తల్లికి మంచి భవిష్యత్తును ఇచ్చారు
Scoliosis In Children

Updated on: May 27, 2025 | 9:58 AM

ఆ చిన్న పాప ఎంతో యాక్టివ్. తల్లిదండ్రులకు తనంటే ఎంతో ఇష్టం. తమ ఇంట మాలక్ష్మి పుట్టిందని భావించి.. ఎంతో చక్కగా చూసుకుంటున్నారు. కాగా  పాపకు ఆరు నెలల వయసు ఉన్నప్పుడు.. వెన్నెముక సహజ ఆకారాన్ని తప్పిపోయి వంగి ఉండటాన్ని తల్లి గమనించింది. మొదట్లో అంత పెద్ద సమస్య ఏం కాదులే అనుకున్నా, కాలక్రమేణా అది మరింత స్పష్టంగా కనిపించింది. దీంతో పాప తల్లిదండ్రులు చాలామంది డాక్టర్లను సంప్రదించారు. దాంతో ఆ పరిస్థితిని స్కోలియోసిస్‌గా నిర్ధారించారు. అంటే వెన్నెముక సరిగా సూటిగా ఉండకుండా, “S” లేదా “C” ఆకారంలో వంగిపోవడం. దీంతో పాప భవిష్యత్ అంధకారంలోకి వెళ్తుందని పేరెంట్స్ ఆందోళన చెందారు. ఏ ఆస్పత్రి నుంచి కూడా వారికి స్పష్టమైన హామి దొరకలేదు.

సపోర్ట్ గ్రూపు ద్వారా దొరికిన భరోసా 

పాపకు ఆరేళ్ల వయసు వచ్చినప్పుడు, ఒక సపోర్ట్ గ్రూప్ ద్వారా తల్లిదండ్రులకు సమాధానం దొరికింది. ఆన్‌లైన్ కమ్యూనిటీలో ఓ వ్యక్తి తనకు విజయవంతంగా జరిగిన స్కోలియోసిస్ సర్జరీ గురించి వివరించడంతో, వారికి కొత్త ఆశ చిగురించింది. ఆ ఆశతో వారు బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్‌లో స్పైన్ సర్జరీ నిపుణుడు డాక్టర్ ఎస్. విద్యాధరను సంప్రదించారు.

సర్జరీకు సిద్ధం

పాపకు పరీక్షలు చేయగా, ఆమె వెన్నుపూస 86 డిగ్రీల వక్రతతో ఉన్నట్లు తేలింది. ఇది “థొరాసిక్ స్కోలియోసిస్” అనే వ్యాధి, దాన్ని నిర్లక్ష్యం చేస్తే గుండె, ఊపిరితిత్తులకు సమస్యలు కలగవచ్చు. డాక్టర్ విద్యాధర రోబోటిక్ టెక్నాలజీ సాయంతో “గ్రోత్ రాడ్ సర్జరీ” చేయాలని సూచించారు. ఇది కేవలం వెన్నుపూస వక్రతను సరిచేయడం కాకుండా, అది సహజంగా పెరగడానికి కూడా సహాయపడుతుంది.

సక్సెస్ అయిన ఆపరేషన్

మే 1, 2025న ఆద్యకు సర్జరీ జరిగింది. అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీతో, ఆమె వెన్నుపూసను సున్నితంగా సరిచేయడం జరిగింది. శస్త్రచికిత్స పూర్తయిన మూడు గంటల్లోనే ఆద్య సపోర్ట్‌తో నడవగలిగింది. రెండు రోజుల్లోనే ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది.

ఆశాభావంతో ముందుకు

ఇప్పుడు ఆద్య సాధారణ ఆరేళ్ల పిల్లల మాదిరిగా ఆడుకుంటుంది. భవిష్యత్తులో కొన్ని ఫాలో-అప్ ట్రీట్మెంట్‌లు అవసరం అవుతాయి. కానీ ఆమె తల్లిదండ్రులు ఇప్పుడు బాలిక భవిష్యత్‌పై ధైర్యంతో ఉన్నారు.