మనకు వచ్చిన పనిని వదలకూడదు.. రాని పని జోలికి అస్సలు వెళ్లకూడదు. ఈ సామెత మీరూ వినే ఉంటారు. అసలు ఎందుకు ఇదంతా ఇప్పుడు చెబుతున్నానంటే.. ఓ ఇద్దరు దొంగలు బైక్‌ను దొంగలించేందుకు విశ్వప్రయత్నాలు చేసి.. చివరికి వట్టి చేతులతో నిష్క్రమించారు. ఎవరో చెప్పినట్లు దొంగతనం కూడా ఓ కళే. దాన్ని చేసేందుకు సరైన టెక్నిక్ అవసరం. కొన్నిసార్లు ఎంత తెలివిగా వ్యవహరించినా దొంగతనాలు ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి సంఘటనల గురించి మీరు వినే ఉంటారు. న్యూస్ పేపర్లలో చదివి ఉంటారు. సరిగ్గా ఇదే సీన్ జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. బైక్ దొంగతనం చేయడానికి వచ్చి ఇద్దరు దొంగలు తాళం రాకపోవడంతో ఉసూరుమంటూ వెనుతిరిగారు. ఆ దృశ్యాలు సమీపంలోని ఆలయం వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నర్సాపురంలోని చిన మామిడిపల్లి నాగారమ్మ ఆలయం సమీపంలో ఉంచిన బైక్‌ను దొంగలించేందుకు ఈ నెల 10వ తేదీన అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఇద్దరు దొంగలు అక్కడికి చేరుకున్నారు. బైక్‌పై వచ్చిన ఆ ఇద్దరు ఆలయం వద్ద ఉంచిన సదరు మోటర్ సైకిల్‌ను దొంగిలించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. దాని తాళం ఎంతకూ రాకపోవడంతో చివరకు అక్కడి నుంచి ఉసూరుమంటూ జారుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి దృశ్యాలు నాగారమ్మ ఆలయంలోని సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. వాటిని ఆలయ కమిటీ సోషల్ మీడియా వేదిక విడుదల చేసింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాహనాలు జాగ్రత్తగా ఉంచుకోవాలని కోరారు.