
దొంగతనాలు నిత్యకృత్యం… రోజూ ఏదో ఒక ప్రాంతంలో దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. అయితే కొన్నిసార్లు దొంగలు వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొందరు ఇళ్లల్లో చోరీ చేయడానికి వచ్చి.. వంటిట్లోకి వచ్చి ఏవైనా వండుకోని తినడం లేదా ఏసీ ఆన్ చేసి పడుకోవడం… వంటివి చేస్తూ ఉంటారు. ఇంకొందరు అయితే మీ ఇంట్లో ఏం దొరకలేదు ఇదిగో ఈ 100 ఉంచండి అని తమ వద్ద ఉన్న డబ్బు అక్కడపెట్టి.. ఒక నోట్ రాసి వెళ్లిపోతూ ఉంటారు. అలానే తాజాగా తమిళనాడు శివగంగ జిల్లాలో ఓ విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది.
అక్కడి తిరుప్పువనమ్ ప్రాంతానికి సమీపంలో డి. పళయ్యూర్ అనే గ్రామం ఉంది. వీరమణి అనే వ్యక్తి అక్కడ నివసిస్తున్నాడు. అతను ఎప్పుడూ తన ద్విచక్ర వాహనాన్ని తన ఇంటి ముందు పార్క్ చేసేవాడు. కొన్ని రోజుల క్రితం, అతను ఎప్పటిలాగే రాత్రి తన ఇంటి ముందు బైక్ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్లి నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం నేను నిద్ర లేచేసరికి, ఆ బైక్ కనిపించకుండా పోయింది. దీనితో షాక్ అయిన వీరమణి, అతని కుటుంబ సభ్యులు అన్ని చోట్లా వెతికారు… కానీ వాహనం దొరకలేదు. గుర్తుతెలియని వ్యక్తులు దానిని దొంగిలించారని నిర్ధారించుకున్న తర్వాత వీరమణి తిరుప్పువనం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
బైక్ దొంగతనం సంఘటనపై కేసు నమోదు చేసిన తిరుప్పువనం పోలీసులు.. గాలింపు జరిపినా ఎలాంటి ఆచూకీ దొరకలేదు. అయితే ఆశ్చర్యకర రీతిలో, ఫిబ్రవరి 24, 2025 రాత్రి వీరమణి ఇంటి ముందు అతని బైక్ ప్రత్యక్షమైంది. బైక్ వద్ద ఓ లేఖ కూడా లభ్యమైంది. ఈ విషయాన్ని వీరమణి వెంటనే తిరుప్పువనం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు ఆ లేఖను అందుకుని చదివి ఆశ్చర్యానికి గురయ్యారు.
అందులో “నేను మరో ప్రాంతం నుంచి వస్తుండగా.. నాలుగు లేన్ల రహదారి సమీపంలో నాకు ఓ సమస్య ఎదురైంది. దీంతో తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితుల్లో మీ వీధి గుండా వస్తున్నప్పుడు బైక్ కనిపించింది. ఆ సమయంలో అవసరం కోసం ఆ బైక్ తీసుకెళ్లడం తప్పు అనిపించలేదు. కానీ ఆ తర్వాత అలా చేయడం నాకు బాధ అనిపించింది. అందుకే 450 కిలోమీటర్లు తిరిగి ప్రయాణించి బైక్ మీ వద్దకు తీసుకొచ్చాను. అత్యవసర పరిస్థితుల్లో మీ బైక్ నాకు ఎంతో సహాయం అందించింది. అందుకు రుణపడి ఉంటాను. బైక్ పెట్రోల్ ట్యాంక్‌లో రూ. 1500 పెట్టాను. వాటిని తీసుకుని నన్ను మన్నించండి. అన్యదా భావించొద్దు” అని ఆ లేఖలో రాసి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.