అందమైన ఇళ్లు, పందిళ్లు పరుచుకున్న లోగిళ్లు, పిల్లా పాపలతో కళకళాలాడాల్సిన ఆ ఊరు.. ఇప్పుడు వల్లకాడులా మారింది. ఎన్నో ఏళ్ల క్రితం నిర్మితమైన కట్టడాలతో అడుగడుగునా చారిత్రక విశిష్టతతో ఉండాల్సిన ఆ ఊరు ఒక్క సారిగా వట్టిపోయింది. పిల్లా, పెద్దా, ముసలీ, ముతకా, ఆడా, మగా అనే తేడా లేకుండా అందరూ రాత్రికి రాత్రే ఇళ్లు ఖాళీ చేసేశారు. పిల్లాపాపలతో కట్టుబట్టలతో తలోదిక్కుకు వెళ్లిపోయారు. ప్రభుత్వం చేసిన ఆ ఒక్క పని కారణంగా ఆ ఊరు ఊరే కకావికలమైపోయింది. ఇలాంటి ఊళ్లు ప్రపంచ వ్యాప్తంగా చాలానే ఉన్నాయి. ఒక్కో గ్రామానిది ఒక్కో కన్నీటి గాథ.. అయితే ప్రస్తుతం శాస్త్రవేత్తలు గుర్తించిన ఓ విలేజ్ మాత్రం.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా అరవై ఏళ్లుగా పాడుపడిపోయింది. అరవయ్యేళ్ల సమయంలో ఆ గ్రామంలో మనిషనే వాడే అడుగు పెట్టలేదంటే అతిశయోక్తి కాదు. దాదాపు అరవయ్యేళ్లుగా ఆ ఊరు ఖాళీగానే ఉంటోంది. స్పెయిన్ దేశంలోని స్వయంపాలిన ప్రాంతమైన ఎస్ట్రెమాడురాలో ఉన్న ఈ ఊరి పేరు గ్రానడిల్లా. ప్రపంచం నలుమూలలా రకరకాల కారణాల వల్ల అక్కడక్కడా ఖాళీ ఊళ్లు కనిపిస్తుంటాయి గాని, గ్రానడిల్లా ఖాళీగా పడి ఉండటానికి కారణం తెలిస్తే మాత్రం అయ్యో పాపం అని అనకుండా ఉండలేం. ఇంతగా అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసుకోవాలని ఉందా..
అన్ని ఊళ్ల మాదిరిగానే గ్రానడిల్లా జనసంచారంతో కళకళలాడింది. ఈ చిన్న పట్టణాన్ని తొమ్మిదో శతాబ్దంలో అప్పటి ముస్లిం పాలకులు నిర్మించారు. ఈ ఊళ్లోని ప్రజలు ప్రధానంగా ఊరి బయటి భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగించేవారు. ఈ ఊరికి సమీపంలో ఓ నది ప్రవహిస్తోంది. ప్రజలు ఈ నది నీటిని ఉపయోగించి పంటలు పండించుకునేవారు. ఈ క్రమంలో స్పెయిన్ నియంత ఫ్రాన్సిస్కో ఫ్రాంకో 1950లో ఈ ఊరి సమీపంలోని నది మీద రిజర్వాయర్ నిర్మించనున్నట్లు ప్రకటించారు. అందుకు ఊరు మొత్తాన్ని ఖాళీ చేయాలని ఆదేశించాడు. రిజర్వాయర్ పనులు కొనసాగుతుండగా, 1960 ప్రాంతంలో ఊరు మునిగిపోవచ్చని అధికారులు అంచనా వేశారు. దాంతో ఊళ్లోని జనాలు భయపడి ఊరిని ఖాళీచేసేశారు.
అయితే.. రిజర్వాయర్ నిర్మాణం పూర్తయినా, ఊరు ముంపునకు గురి కాలేదు. రిజర్వాయర్ కోసం గ్రానడిల్లా వెళ్లాల్సిన మార్గాలన్నింటినీ ధ్వంసం చేసేశారు. దీంతో ఆ గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఇలా దాదాపు 60 ఏళ్లుగా జనసంచారం లేని గ్రామంగా గ్రానడిల్లా చరిత్రలో మిగిలిపోయింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..