సాధారణంగా దేవాలయాలు ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. అక్కడ ఉండే ప్రసాదం కౌంటర్ల గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. లడ్డూ ప్రసాదాల కోసం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే ఆలయానికి కూడా భారీగా భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలోనే ప్రసాదం కౌంటర్ల వద్ద తాకిడి ఎక్కువైంది. ఇక అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఓ అధికారి పొరపాటున చేసిన పనికి.. పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని చామరాజనగర్ సమీపంలోని మలిమహాదేశ్వర్ కొండపై ఉండే గుడి ఎప్పుడూ భక్తులతో రద్దీగా ఉంటుంది. ఆ రోజు అమావాస్య కావడంతో ఆలయానికి భక్తజనం భారీగా పోటెత్తారు. వారంతా కూడా దేవుడి దర్శనం ముగించుకుని ప్రసాదం కౌంటర్ల వద్దకు చేరుకున్నారు. ఇక అక్కడ కౌంటర్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ అధికారి.. భక్తుల తాకిడికి హడావుడిలో ఒకరికి అందజేయాల్సిన డబ్బుల బ్యాగ్.. ప్రసాదంతో సహా భక్తుడికి అందజేశాడు. కాసేపటికి తేరుకున్న అధికారి.. అతడి పక్కన డబ్బుల బ్యాగ్ కనిపించకపోవడంతో.. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాడు. అది కాస్తా పొరపాటున భక్తుడికి అందజేసినట్లు గుర్తించాడు. అందులో సుమారు రూ. 2.91 లక్షల క్యాష్ ఉంది. అది దేవస్థానం అకౌంట్‌లో జమ చేయాల్సిన డబ్బు కాగా.. ఇలా అయిపోయిందని అధికారి వాపోయాడు.