
రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ఇండో-పాక్ సరిహద్దుకు సమీపంలో దేరాసర్ గ్రామం ఉంది. ఈ గ్రామంలో 600 మంది కంటే ఎక్కువగా జనాభా ఉండరు. అయినా సరే ఈ గ్రామం ఒక వింత సంప్రదాయంతో వార్తల్లో నిలిచింది. ఈ చిన్న గ్రామంలో ప్రతి పురుషుడికి ఇద్దరు భార్యలు ఉంటారు. పురుషులు ఇద్దరు స్త్రీలను వివాహం చేసుకోవడానికి ఇష్టపడటం కాదు.. అది ఆ గ్రామంలోని వింత ఆచారంలో భాగం.
దేరాసర్‌లో నివసించే ప్రతి పురుషుడు తప్పని సరిగా రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఈ అసాధారణ సంప్రదాయం వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన కారణం ఏమిటంటే.. ఈ గ్రామంలో ఒక పెళ్లి చేసుకున్న పురుషుడికి మొదటి భార్యతో పిల్లలు పుట్టరట. లేదా మొదటి భార్యకు కుమార్తె పుడుతుందట. అంటే మొదటి భార్య సాధారణంగా గర్భం దాల్చదని.. ఒకవేళ గర్భవతి అయినా ఆడపిల్ల పుడుతుందని నమ్మకం. అందుకనే తప్పని సరిగా రెండో పెళ్లి చేసుకుంటారు. ఇలా రెండో పెళ్లి చేసుకుంటే ఆ రెండవ భార్యకు కొడుకు పుడతాడని.. అలా కుటుంబ వంశం కొనసాగుతుందని విశ్వాసం. ఇలాంటి నమ్మకం.. సంప్రదాయం సంవత్సరాలుగా కొనసాగుతూనే వస్తుంది.
గ్రామంలో చాలా మంది తమ మొదటి భార్యతో బిడ్డను కనడానికి దాదాపు సగం జీవితాన్ని వేచి ఉన్నారు. అయితే ఆ పురుషులు రెండో వివాహం చేసుకున్న తర్వాత పిల్లలు పుడతారని గ్రామస్తులు ధృవీకరిస్తున్నారు. ఒక వ్యక్తి రెండవ వివాహం చేసుకున్న తర్వాత ముగ్గురు పిల్లలను కూడా కన్నాడు. అయితే ఈ ఇద్దరు భార్యలు బాధ్యతలను పంచుకుంతూ ఒకే ఇంట్లో సామరస్యంగా జీవిస్తారు. ఈ ఆచారం ఇప్పుడు తగ్గుతున్నప్పటికీ.. ఇంకా కొనసాగుతోంది. అయితే ఈ వింత ఆచారాలు, మూఢనమ్మకాలు కొడుకు అవసరమనే ఆలోచనా ధోరణికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..