Tomatina festival: రెండు సంవత్సరాల కోవిడ్ విరామం తర్వాత టొమాటో హోలీ స్పెయిన్‌లో తిరిగి అట్టహాసంగా నిర్వహించారు..ఈ వేడుకలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అక్కడి ప్రజలంతా సంతోషంగా పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా స్పానిష్‌లోని బునోల్ నగర ప్రజలు ట్రక్కులపై 130 టన్నుల టమోటాలతో వీధుల్లోకి వచ్చి తమ ‘టొమాటిన’ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఇకపోతే, స్పెయిన్‌లో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి ఈ టొమాటినా ఫెస్టివల్.. సాధారణంగా ఈ పండగని లా టొమాటినా అని పిలుస్తారు. ఇది ప్రతి సంవత్సరం ఆగస్ట్ చివరిలో వాలెన్సియాలోని బునోల్‌లో జరుగుతుంది. ప్రాణాంతకమైన COVID-19 వైరస్ కారణంగా గత రెండేళ్లలో పండుగ రద్దు చేశారు. కానీ, కరోనా మహమ్మారి కాస్త శాంతించటంతో..టొమాటో హోలీ తిరిగి ప్రారంభమైంది.
బుధవారం, స్పానిష్ పట్టణంలోని బునోల్‌లో 75వ ఎడిషన్ లా టొమాటినా పండుగను సందడిగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఔత్సాహికులు పాల్గొని ఒకరికొకరు టమోటాల వర్షం కురిపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార పోరుగా చెప్పుకునే టొమాటో పండుగ, విదేశీ పర్యాటకులలో ముఖ్యంగా బ్రిటన్, ఆస్ట్రేలియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్ నుండి వచ్చినవారిలో ప్రజాదరణ పొందింది. ఆరు ట్రక్కులతో టమాటాలను దించడంతో గ్రాండ్‌గా వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రజలు సుమారు 130 టన్నుల టమోటాలను ఒకరిపై ఒకరు విసిరారు. ఈ సరదా పోరాటం తరువాత ఉత్సవాలు, కచేరీలు, పోటీలు ఉంటాయి. ఇవి రాత్రి వరకు కొనసాగుతాయి.
లా టొమాటినా ఫెస్టివల్ ఆగస్టు చివరి బుధవారం 1945లో ప్రారంభమైంది. అప్పటి నుండి ప్రతీ సంవత్సరం టొమాటో ఫెస్టివల్ జరుపుకుంటున్నారు. కానీ, కరోనా కారణంగా రెండేళ్ల విరామం తర్వాత తిరిగి పండగను ప్రారంభించారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రజలు ఆనందోత్సాహాలతో ఉల్లాసంగా గడిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి