రష్యాలో ప్లేగు కలకలం.. ల్యాబ్ ఉద్యోగిని మృతిపై తల్లి సంచలన ఆరోపణలు!

రష్యాలో ప్లేగు వ్యాధి వ్యాప్తి చెందుతోందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. సైబీరియాలోని యాంటీ ప్లేగు పరిశోధనా సంస్థలో పనిచేసిన 29 ఏళ్ల దర్యా షిపిలోవా మృతి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. తన కుమార్తె మరణంపై ఆమె తల్లి స్వెత్లానా తాజాగా స్పందించారు. తన కుమార్తె మరణానికి సంబంధించి వస్తున్న వార్తలను ఖండిస్తూ.. అధికారులు ఆమెను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

రష్యాలో ప్లేగు కలకలం.. ల్యాబ్ ఉద్యోగిని మృతిపై తల్లి సంచలన ఆరోపణలు!
Russian Lab Worker Mother Speaks Up About Plague Scare

Updated on: Oct 10, 2026 | 3:21 PM

దర్యా షిపిలోవా అక్టోబర్ 2న మరణించింది. ఇర్కుట్స్క్ యాంటీ ప్లేగు రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్న సమయంలో ఆమె అనుకోకుండా ఓ టెస్ట్ ట్యూబ్ పగలగొట్టిందనీ, దాని ద్వారా న్యుమోనిక్ ప్లేగుకు కారణమయ్యే బ్యాక్టీరియా సోకిందని వార్తలొచ్చాయి. అయితే, ఈ వాదనలను దర్యా తల్లి స్వెత్లానా ఖండించారు. ఆమె శాస్త్రవేత్త కూడా కావడంతో ఈ అంశంపై తనకు అవగాహన ఉందని చెప్పారు. టెస్ట్ ట్యూబ్ పగిలి ప్రమాదకరమైన బ్యాక్టీరియా బయటకు వచ్చిందన్న కథనాన్ని తాను నమ్మడం లేదని చెప్పారు. టెస్ట్ ట్యూబ్‌ను గోడకు విసిరినా అంత సులభంగా పగలదని, వాటిని చాలా జాగ్రత్తగా సురక్షితంగా రూపొందిస్తారని అందులోని పదార్థాలు బయటకు చిందడం జరగదనీ వివరించారు.

‘నా కూతురు చనిపోతుంటే పట్టించుకోలేదు’

తన కుమార్తె ను కాపాడేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దర్యా షిపిలోవా న్యుమోనిక్ ప్లేగుతో మరణించిందన్న వార్తలను రష్యా అధికారులు తోసిపుచ్చారు. ఆమెకు న్యుమోనియా వచ్చిందని చెబుతున్నారు. తొలుత ది మాస్కో టైమ్స్ పత్రిక సైబీరియాలో ప్రమాదకరమైన ప్లేగు రకం కారణంగా దర్యా మరణించిందని, ఆమెతో కాంటాక్ట్‌లో ఉన్న 200 మందికి నిర్వహించిన పరీక్షల్లో ప్రమాదకరమైన అంటువ్యాధులకు కారణమయ్యే వ్యాధికారకాలు ఏవీ గుర్తించలేదని కథనం రాసింది. ఆ తర్వాత రష్యా అధికారులు దీనిపై వివరణ ఇచ్చారు.

పుతిన్‌ కు ఫోన్‌ చేసిన ట్రంప్‌

రష్యాలో ప్లేగు వ్యాప్తి చెందుతోందన్న వార్తల నేపథ్యంలో అమెరికా స్పందించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడగా, పరిస్థితి అదుపులోనే ఉందని పుతిన్ హామీ ఇచ్చారు. రష్యా పొరుగు దేశాలైన మంగోలియా, కిర్గిజిస్థాన్, ఉజ్బెకిస్థాన్‌ తమ సరిహద్దుల్లోని ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాయి. దర్యా షిపిలోవా మరణానికి అసలు కారణం ఏమిటన్నది ఓ మిస్టరీగా మిగిలింది. ఆమె తల్లి అధికారులపై ఆరోపణలు చేస్తుండగా, రష్యా ప్రభుత్వం మాత్రం ప్లేగు వ్యాప్తి వార్తలను ఖండిస్తోంది. ఆమె న్యూమోనియాతో మృతి చెందినట్లు చెబుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us