ఈ మధ్యకాలంలో యువత మత్తుకు చిత్తు అవుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. డ్రగ్స్ అక్రమంగా సరఫరా చేస్తోన్న స్మగ్లర్లను పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నా.. వాళ్ల ఎత్తులను చిత్తు చేస్తూ.. క్రియేటివిటీకి పదునుపెట్టి డ్రగ్స్ అక్రమ రవాణాను కొనసాగిస్తూ.. పోలీసులను విస్మయానికి గురి చేస్తున్నారు. ఎయిర్ వేస్.. వాటర్ వేస్.. రోడ్ వేస్.. రైల్వేస్.. ఇలా ఏదీ వదట్లేదు స్మగ్లర్లు. ఇటీవల ట్రైన్స్‌లో అధికంగా మత్తు రవాణా జరుగుతోంది. అది తెలుసుకునే ఆర్‌పీఎఫ్ పోలీసులు ప్రతీ ట్రైన్‌లోనూ విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలోనే పక్కా సమాచారంతో తాజాగా పానిపట్ స్టేషన్‌లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF) పోలీసులు జామ్‌నగర్ – శ్రీ మాతా వైష్ణోదేవి కాత్రా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు చేపట్టారు. వారికి ఆ ట్రైన్‌లోని ఓ కోచ్ సీట్ కింద అనుమానాస్పద బ్యాగ్ ఒకటి కనిపించింది. అందులో సుమారు 3 కిలోల హెరాయిన్ ఉన్నట్లు గుర్తించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ. 3 కోట్లు ఉంటుందని అంచనా. ఆ బ్యాగ్ ఎవరిదన్న విషయాన్ని పోలీసులు ఇంకా కనిపెట్టలేకపోయారు. ఈ క్లెయిమ్ చేయని బ్యాగ్‌లో రాజస్థాన్‌కు చెందిన ఓ కవర్ దొరకడంతో.. దాని ఆధారంగా పోలీసులు విచారణ చేయడం మొదలుపెట్టారు.