సినిమా సీన్‌ను తలపించిన చైన్ స్నాచింగ్.. చివరికి దొంగలకు దిమ్మతిరిగే ట్విస్ట్!

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో పట్టపగలు జరిగిన చైన్ స్నాచింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఓ రిటైర్డ్ గవర్నమెంట్ డాక్టర్ తన భార్యతో కలిసి స్కూటర్‌పై వెళ్తుండగా.. ఇద్దరు దుండగులు బైక్‌పై వెంబడించి బంగారు గొలుసు లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే దొంగలు వేసిన ప్లాన్ చివరకు వారికే ఎదురుతిరిగింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సినిమా సీన్‌ను తలపించిన చైన్ స్నాచింగ్.. చివరికి దొంగలకు దిమ్మతిరిగే ట్విస్ట్!
Chain Snatching

Updated on: Sep 14, 2026 | 4:42 PM

అజ్మీర్: రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో పట్టపగలు జరిగిన చైన్ స్నాచింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఓ రిటైర్డ్ గవర్నమెంట్ డాక్టర్ తన భార్యతో కలిసి స్కూటర్‌పై వెళ్తుండగా.. ఇద్దరు దుండగులు బైక్‌పై వెంబడించి బంగారు గొలుసు లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే దొంగలు వేసిన ప్లాన్ చివరకు వారికే ఎదురుతిరిగింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అజ్మీర్‌కు చెందిన డాక్టర్ మహేంద్ర జైన్ తన భార్య సుచిత్ర జైన్‌తో కలిసి స్కూటర్‌పై ఇంటికి వెళ్తున్నారు. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు మోటార్‌సైకిల్‌పై వారిని కొంతదూరం నుంచి వెంబడించారు. రహదారిపై అవకాశం కోసం ఎదురుచూసిన దుండగులు స్కూటర్‌ను ఢీకొట్టారు. వెనుక కూర్చున్న వ్యక్తి సుచిత్ర జైన్ మెడలోని బంగారు గొలుసును లాక్కోవడానికి ప్రయత్నించాడు. అయితే గొలుసు లాక్కున్న సమయంలో దుండగులు ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పింది. దీంతో ఇద్దరూ బైక్‌తో సహా రోడ్డుపై పడిపోయారు. అయినప్పటికీ దుండగులు వెనక్కి తగ్గలేదు. వారిలో ఒకరు లేచి తన వద్ద ఉన్న పిస్టల్‌ను బయటకు తీసి మహిళను బెదిరించి గొలుసును లాక్కున్నాడు.

దొంగలకు ఎదురైన షాక్

దుండగులు ఆయుధంతో బెదిరించడంతో బాధితులు భయపడతారని భావించారు. కానీ అక్కడే ఉన్న ఓ స్థానిక యువకుడు వెంటనే స్పందించాడు. నల్ల చొక్కా ధరించిన యువకుడు దొంగల్లో ఒకరిని పట్టుకునేందుకు పరుగెత్తుకుంటూ వెళ్లాడు. అతడిని పట్టుకోవడంతో చుట్టుపక్కల ఉన్న జనం కూడా తోడయ్యారు. దీంతో దుండగులు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. స్థానికులు ఇద్దరినీ పట్టుకుని నిలదీశారు. ఈ క్రమంలో వారిపై దాడికి పాల్పడ్డారు. కొద్దిసేపటి క్రితం పిస్టల్‌తో ప్రజలను భయపెట్టిన దొంగలే చివరకు జనాల మధ్య చిక్కుకుని చావుదెబ్బలు తిన్నారు. ఈ ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్థానిక యువకుడి ధైర్యాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.

సమాచారం అందుకున్న సివిల్ లైన్స్ పోలీసులు ఘటనపై ఆరా తీశారు. దొంగలు ఉపయోగించిన పిస్టల్ నిజమైనదా లేదా నకిలీదా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా ఫిర్యాదు నమోదైన విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us