AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరుదైన ఒరంగుటాన్లు డిప్రెషన్ లోకి వెళ్లకుండా అధికారులు ఏం చేశారంటే…

ఒడిశా అడవులలో స్మగ్లింగ్ ముఠా ఆటకట్టించారు ఒడిశా స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) పోలీసులు. విదేశీ ఒరాంగుటాన్ జాతి కోతి పిల్లలను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా జూకు తరలించి కోతి పిల్లల పునరావాసానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ట్రామా నుంచి బయటపడి కోలుకునేలా మ్యూజిక్ థెరపీ ఇస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది.

అరుదైన ఒరంగుటాన్లు డిప్రెషన్ లోకి వెళ్లకుండా అధికారులు ఏం చేశారంటే...
Nandanankanan Zoo Music Therapy For 5 Orangutan Cubs
Sharada V
|

Updated on: Sep 14, 2026 | 2:41 PM

Share

ఒడిశాలోని బాలాసోర్ జిల్లా విచిత్రపూర్ ప్రాంతంలోని బడపాహి అడవిలో రెస్క్యూ చేసిన ఐదు చిన్న ఒరాంగుటాన్ పిల్లలను, ప్రస్తుతం నందన్‌కానన్ జూ పార్క్ కు చెందిన క్వారంటైన్ వార్డులో 24 గంటల పర్యవేక్షణలో ఉంచారు. తల్లుల నుంచి వేరై, సుదీర్ఘ ప్రయాణం చేసి అలసి పోయి, పూర్తిగా కొత్త వాతావరణంలోకి అడుగుపెట్టడాన్ని ఆ చిన్ని ప్రాణులు తట్టుకోలేకపోతున్నాయి.  తీవ్ర మానసిక ఆందోళనకు గురి కావడంతో,  జూకు చేరుకున్న వెంటనే అవి ఒకదానికొకటి గట్టిగా హత్తుకుని, భయంతో విలవిలలాడుతూ రోదించాయి.  రక్షించబడిన ఐదు పిల్లలలో  నాలుగింటి వయస్సు ఒక సంవత్సరం వయసు లోపే ఉండటం గమనార్హం. అటవీశాఖ అధికారులు, నందన్‌కానన్ జూ సిబ్బంది కలిసికట్టుగా ఆ ఐదు ఒరాంగుటాన్ పిల్లలను సంరకిస్తున్నారు. వాటిలో తీవ్ర మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ప్రత్యేక చికిత్సలను అందిస్తున్నారు.

మ్యూజిక్ థెరపీతో సాంత్వన

వైద్యుల సూచన మేరకు,  జంతువులకు ప్రశాంతత చేకూర్చేందుకు క్వారంటైన్ గదులలో శాస్త్రీయ సంగీతాన్ని వినిపిస్తున్నారు.  24 గంటల పాటు మృదువైన ట్యూన్‌లను,  భారతీయ శాస్త్రీయ సంగీత రాగాలను ప్రత్యేక సౌండ్ సిస్టమ్‌ ద్వారా వినిపిస్తున్నారు. ఈ వినూత్న పద్ధతి ద్వారా కోతి పిల్లలు త్వరగా సాధారణ స్థితికి వస్తాయని ఆశిస్తున్నట్లు జూ డిప్యూటీ డైరెక్టర్ ప్రదీప్ మిరాసే తెలిపారు.

అరటిపండ్లు, ఆపిల్స్, పాలు, సెరిలాక్‌తో కూడిన పౌష్టికాహారాన్ని సైతం అందిస్తున్నారు. ఇటీవల ఒక కోతి పిల్లకు స్వల్పంగా జ్వరం వచ్చినప్పటికీ, అది ఇప్పుడు కోలుకుంది. వెటర్నరీ వైద్యులు 24 గంటలూ ఎంతో జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. అయితే, రక్త నమూనాలు సేకరించడం వల్ల వాటికి మరింత మానసిక ఆందోళన పెరుగుతుందనే ఉద్దేశంతో ఆ ప్రక్రియను దాదాపు 10 రోజులు వాయిదా వేశారు.

అక్రమ రవాణా నుంచి రక్షించబడిన ఐదు అరుదైన ఒరాంగుటాన్ కోతి పిల్లలకు నందన్‌కానన్ జూ అధికారులు ప్రత్యేక సంరక్షణ అందిస్తున్నారు. వాటి ఆరోగ్యంపై నిరంతరం కన్నేసి ఉంచేందుకు వీలుగా వాటిని క్వారంటైన్ వార్డులో ఉంచి 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.  ఎన్‌క్లోజర్‌లో ఉయ్యాలలు, సాఫ్ట్ టాయ్స్, ఇతర ఆటవస్తువులను ఏర్పాటు చేశారు. ఒరాంగుటాన్ పిల్లలు క్రమంగా కొత్త వాతావరణానికి అలవాటుపడుతున్నాయనీ తరచూ ఆడుకుంటూ, తమ సంరక్షకులతో (కీపర్స్) కూడా మంచి బంధాన్ని ఏర్పరచుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

తల్లికి దూరమైన కోతి పిల్ల పంచ్ వైరల్

ఒరాంగుటాన్ జాతి అరుదైన కోతి పిల్లలు డిప్రెషన్ లోకి వెళ్లకుండా అధికారులు సంరకించిన తీరును జపాన్ లో ఇటీవల జరిగిన పంచ్ ఘటనను గుర్తుచేస్తుంది.  తల్లికి దూరమైన కోతి పిల్ల పంచ్, మెత్తటి బొమ్మలో అమ్మను వెతుక్కున్న వైనం 2026 ఫిబ్రవరిలో జపాన్ జూలో సందర్శకుల గుండెలను పిండేసింది. పుట్టిన కొద్ది రోజులకే  కన్నతల్లి దానిని విడిచిపెట్టడంతో అది పూర్తిగా ఒంటరిదైంది. తోటి కోతులు దానిని గుంపులోకి రానివ్వకుండా తరిమేయడంతో, జూ సిబ్బంది దానికి ఒక మృదువైన స్టఫ్ టాయ్ ఇచ్చారు. ఆ బొమ్మే తన తల్లి అని నమ్మి, దానిని ఎప్పుడూ ఒంటికి హత్తుకుని తిరగడం అక్కడి సందర్శకులను కంటతడి పెట్టించింది. ఆ బొమ్మ సహాయంతో ఆ కోతి పిల్ల క్రమంగా మానసిక ఆందోళన నుంచి కోలుకుంది.  జూ సిబ్బంది ప్రత్యేక పర్యవేక్షణలో ఆరోగ్యంగా తిరిగింది.  అధికారులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.  తల్లి ప్రేమకు దూరమైన ఆ చిన్న కోతి పిల్ల వేదన కంటతడి పెట్టించింది. రక్త సంబంధం లేకపోయినా, కనీసం ప్రాణం లేని బొమ్మలోనే తన అమ్మను వెతుక్కుంటూ ఆ పసి ప్రాణి పడిన తపన కళ్లకు కట్టింది. ఒంటరితనంలో దానికి ఆ బొమ్మే ఒక అభయంలా మారడం ఎంతో ఉద్వేగభరిత ఉదంతంగా మారింది.

Follow Us