30,000అడుగుల ఎత్తులో విమానం.. గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు.. ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉందంటే..

220 మంది ప్రయాణికులతో వెళ్తున్న జెట్2 (Jet2 Flight LS1266) విమానంలో 30,000 అడుగుల ఎత్తులో తీవ్ర కలకలం రేగింది. ప్రయాణంలో ఉండగా ప్రధాన పైలట్‌కు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో, విమానాన్ని పోర్చుగల్‌లోని పోర్టో విమానాశ్రయానికి అత్యవసరంగా మళ్లించారు. ఆ సమయంలో కో-పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించి విమాన నియంత్రణను తన చేతుల్లోకి తీసుకున్నారు. అత్యవసర ల్యాండింగ్ కోసం విమానం చాలా వేగంగా కిందికి దిగుతున్న సమయంలో..

30,000అడుగుల ఎత్తులో విమానం.. గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు.. ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉందంటే..
Pilot heart attack mid air

Updated on: May 24, 2026 | 3:21 PM

స్పెయిన్‌లోని టెనెరిఫే నుండి బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌కు ప్రయాణిస్తున్న జెట్2 (Jet2 Flight LS1266) విమానంలో ఊహించని ప్రమాదం తృటిలో తప్పింది. సుమారు 30,000 అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తున్న సమయంలో ప్రధాన పైలట్‌కు అకస్మాత్తుగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దీంతో విమానంలో ఒక్కసారిగా గందరగోళం, భయాందోళన వాతావరణం నెలకొంది. విమానంలో మొత్తం 220 మంది ప్రయాణికులు ఉన్నారు. పైలట్‌కు ఆరోగ్యం క్షీణించడంతో క్యాబిన్ సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వారు కన్నీళ్లతో విమానంలోని ప్రయాణీకుల మధ్యకు పరిగెడుతూ, వారిలో ఎవరైనా వైద్య శిక్షణ పొందిన వారు లేదా డాక్టర్లు ఉన్నారా అని అత్యవసరంగా అడగడం ప్రారంభించారు. విమానంలోని లైట్లు ఫ్లాష్ అవ్వడం, సిబ్బంది కంగారు పడటంతో నిద్రిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా మేల్కొని ఆందోళనకు గురయ్యారు.

పైలట్ అస్వస్థతకు గురికావడంతో కో-పైలట్ (ఫస్ట్ ఆఫీసర్) వెంటనే స్పందించి విమాన నియంత్రణను తన చేతుల్లోకి తీసుకున్నారు. అత్యవసర ల్యాండింగ్ కోసం విమానాన్ని పోర్చుగల్‌లోని పోర్టో వైపు మళ్లించారు. ఈ క్రమంలో విమానం చాలా వేగంగా కిందికి దిగడంతో లోపల ఉన్న చిన్న పిల్లలు ఏడవడం ప్రారంభించారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ప్రయాణికులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నారు. అయినప్పటికీ, కో-పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని పోర్టో విమానాశ్రయంలో తెల్లవారుజామున 2:11 గంటలకు సురక్షితంగా ల్యాండ్ చేశారు. రన్‌వేపై సిద్ధంగా ఉన్న అత్యవసర వైద్య సిబ్బంది వెంటనే విమానంలోకి వెళ్లి పైలట్‌కు చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు.

విమానం సురక్షితంగా ల్యాండ్ అయినప్పటికీ ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. ల్యాండ్ అయిన తర్వాత గంటకు పైగా విమానం నుండి కిందకు దించలేదని, తమకు సరైన వసతి సౌకర్యాలు కల్పించలేదని, దాదాపు 13 గంటల పాటు పోర్చుగల్‌లోనే చిక్కుకుపోయామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. వసతి కల్పించడం చాలా ఖరీదైన వ్యవహారమని ఎయిర్‌లైన్స్ సిబ్బంది చెప్పినట్లు ప్రయాణికులు తెలిపారు. ఆ తర్వాత జెట్2 సంస్థ మాంచెస్టర్ నుండి మరొక పైలట్‌ను పంపి ప్రయాణికులను సురక్షితంగా బర్మింగ్‌హామ్‌ చేర్చింది.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనపై జెట్2 ఎయిర్‌లైన్స్ స్పందిస్తూ, పైలట్ అస్వస్థత కారణంగానే విమానాన్ని మళ్లించాల్సి వచ్చిందని, ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని స్పష్టం చేస్తూ, వారికి జరిగిన ఆలస్యానికి క్షమాపణలు చెప్పింది. అలాగే ప్రయాణికులు వచ్చే వారం రోజుల్లోగా జెట్2కు చెందిన ఇతర విమానాల్లోకి ఉచితంగా మారే అవకాశాన్ని కూడా కల్పించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us