Vemulawada: భీమేశ్వర ఆలయంలో మరోమారు ప్రత్యక్షమైన నాగరాజు.. పాము భయంతో పరుగులు తీసిన భక్తులు!

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ ఎంతో ప్రసిద్ధి.. ఇక్కడికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. కానీ, ఇటీవల ఇక్కడి శ్రీ భీమేశ్వర ఆలయ సమీపంలో తరచూ విష సర్పాల సంచారం కలకలం రేపుతోంది. తాజాగా భీమేశ్వర ఆలయం ప్రాంగణంలో ఓ నాగుపాము ప్రత్యక్షం కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆలయ ప్రాంగణంలో ఒక్కసారిగా నాగుపాము సంచరించడంతో దర్శనానికి వచ్చిన భక్తులు భయాందోళనతో పరుగులు తీశారు. చివరకు ఏం జరిగిందంటే..

Vemulawada: భీమేశ్వర ఆలయంలో మరోమారు ప్రత్యక్షమైన నాగరాజు.. పాము భయంతో పరుగులు తీసిన భక్తులు!
Bhimeswara Temple

Edited By:

Updated on: Jul 04, 2026 | 11:52 AM

ప్రస్తుతం వేములవాడ పుణ్యక్షేత్రంలో ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే భీమేశ్వర ఆలయంలో భక్తులకు దర్శనాలు కూడా కల్పిస్తున్నారు. అయితే, గురువారం ఆలయ సమీపంలో భారీ నాగుపాము కనిపించడంతో భక్తులు వెంటనే అప్రమత్తమై ఆలయ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు హుటాహుటిన స్నేక్ క్యాచర్‌కు ఫోన్ చేయడంతో ఆయన సకాలంలో అక్కడికి చేరుకున్నారు. భక్తులను దూరం పంపి, ఎవరికీ ఎటువంటి హాని కలగకుండా ఆ నాగుపామును చాకచక్యంగా పట్టుకుని, సురక్షితంగా దూర ప్రాంతంలో అడవిలో వదిలిపెట్టారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఆందోళనలో భక్తులు.. ఐదో సంఘటన ఇది!:

ఇటీవల కాలంలో వేములవాడ ఆలయ పరిసరాల్లో పాముల సంచారం విపరీతంగా పెరిగిపోవడం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజా సంఘటనతో కలిపి ఈ మధ్య కాలంలో పాములు బయటపడటం ఇది ఐదోసారి కావడం గమనార్హం. గతంలో ఇక్కడి ‘నందీశ్వర వసతి గృహం’లో కూడా ఒక పాము దూరి కలకలం సృష్టించింది. అప్పుడు కూడా స్నేక్ క్యాచరే దానిని పట్టుకుని బయట వదిలేశారు. ఇప్పుడు ఏకంగా భక్తులు ఎక్కువగా తిరిగే భీమేశ్వర ఆలయ ప్రాంగణంలోనే నాగుపాము కనిపించడంతో భక్తుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

కారణం అదేనా..?:

ఆలయ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచకపోవడం వల్లే పాములు వస్తున్నాయని స్థానికులు కొందరు ఆరోపిస్తుండగా, అధికారులు మాత్రం మరో కారణం చెబుతున్నారు. ప్రస్తుతం ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు జరుగుతుండటం వల్ల భూమిలో కదలికలు వచ్చి, వాటి నివాసాలు దెబ్బతిని పాములు బయటకు వస్తున్నాయని పేర్కొంటున్నారు. దీనికి తోడు వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల కూడా పాములు సహజంగానే బయటకు వస్తాయని స్నేక్ క్యాచర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

భక్తులు ఎవరూ ఆందోళన చెందవద్దని, పాములు కనిపిస్తే వాటిని చంపకుండా వెంటనే తమకు సమాచారం ఇస్తే సురక్షితంగా పట్టుకుంటామని ఆయన సూచించారు. ఏది ఏమైనప్పటికీ, భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ఆలయ అధికారులు పరిసరాలను మరింత శుభ్రంగా ఉంచి, తగిన రక్షణ చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us