Viral Video: ఆన్‌లైన్‌లో బంగారు నాణెం ఆర్డర్ పెట్టాడు.. పార్శిల్‌లో వచ్చింది చూడగా

ఈ రోజుల్లో ఆన్‌లైన్‌ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. అన్ని ఇంటి దగ్గరికే వచ్చేయాలని మనం ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ పెడుతుంటే.. తీరా పార్శిల్ ఓపెన్ చేసి చూసి కంగుతిన్నారు కస్టమర్లు. అలాంటి కోవకు చెందిన ఘటన ఇది. ఓ సారి లుక్కేయండి.

Viral Video: ఆన్‌లైన్‌లో బంగారు నాణెం ఆర్డర్ పెట్టాడు.. పార్శిల్‌లో వచ్చింది చూడగా
Gold Coin Scam

Updated on: Nov 10, 2025 | 11:26 AM

పాలు నుంచి పామాయిల్ వరకు.. కూరగాయల నుంచి ఖరీదైన వస్తువుల వరకు అన్నింటికీ కేరాఫ్ అడ్రస్‌గా మారాయ్ ఆన్‌లైన్ యాప్స్. ఇటీవల వీటి ద్వారా మనం వన్ గ్రాము గోల్డ్, వెండి లాంటి విలువైన వాటిని కూడా ఆర్డర్ పెట్టొచ్చు. సరాసరి ఇంటికే డెలివరీ ఇచ్చేస్తారు. సరిగ్గా ఇప్పుడు చెప్పబోయే వీడియో కూడా అలాంటిదే..! ఓ వ్యక్తి ఎంతగానో ఇష్టపడి ఒక బంగారు నాణేన్ని ఇంటికి ఆర్డర్ పెట్టాడు. ఇక అది కూడా కొద్దిసేపటికి ఇంటికి వచ్చింది. తీరా ఆ పార్శిల్ ఓపెన్ చేశాక అతడి నోట మాట రాలేదు.

వైరల్ వీడియో ప్రకారం.. ఇన్‌స్టామార్ట్ నుంచి ఆర్డర్ చేసిన పార్శిల్‌ను డెలివరీ బాయ్ ముందు ఓ కస్టమర్ ఓపెన్ చేస్తున్నట్టు మీరు చూడవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత ఆన్‌లైన్ డెలివరీలో కూడా ఇంత పెద్ద మోసాలు జరుగుతాయా అని మీరే భయపడతారు. దీనిని ఇన్‌స్టాగ్రామ్ యూజర్ దేవ్ కంతురా ఇంటర్నెట్‌లో షేర్ చేశారు. తాను ఇన్‌స్టామార్ట్ నుంచి సుమారు రూ. 13,028 విలువైన బంగారు నాణెం కొనుగోలు చేశానని చెప్పుకొచ్చాడు. పార్శిల్ వచ్చిన వెంటనే సదరు కస్టమర్.. డెలివరీ బాయ్ ముందే దాన్ని అన్‌ప్యాక్ చేస్తున్నాడు. తనకు వచ్చిన మొదటి ప్యాకేజీపై ఉన్న సీల్ కూడా ఇలానే విరిగిపోయినట్లు వీడియోలో చూపిస్తున్నాడు. ఇక కళ్యాణ్ జ్యువెలర్స్ పేరిట ఉన్న ఆ ప్యాకింగ్ బాక్స్‌ను ఓపెన్ చేయగా.. అది పూర్తి ఖాళీగా ఉండటాన్ని మీరు చూడవచ్చు. సోదరా మునుపటి పార్శిల్ కూడా ఇలానే ఉంది. అప్పుడు ఓపెన్ చేసినా బాక్స్ ఖాళీ ఉంది. దాన్ని డెలివరీ చేసింది నువ్వే కదా.? అని డెలివరీ బాయ్‌కి చెబుతూ.. వీడియో చివరిలో ఈ విషయంపై ఈ-మెయిల్, యాప్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు కస్టమర్ క్లారిటీ ఇచ్చాడు.

ఈ 55 సెకన్ల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇది ఒక్కసారి జరిగిన పొరపాటు కాదని.. ఒకే ఆర్డర్ రెండుసార్లు ఇలా జరిగిందని.. ఇదే స్కాం అని కస్టమర్ పేర్కొన్నాడు. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చిపడ్డాయి. వరుసపెట్టి నెటిజన్లు కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. కొంతమంది ఎప్పుడూ ఇలాంటి ఖరీదైన వస్తువులను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తామని రాసుకొచ్చారు. ఖరీదైన ఆర్డర్‌లను స్వీకరించేటప్పుడు ప్యాకేజీని ఎల్లప్పుడూ వీడియో తీయాలని మరికొందరు అన్నారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.