ఆమె ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్.. బికినీలో ఫోటోలు దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిందట. ఇక వాటిని ఓ స్టూడెంట్ లైక్ కొట్టాడు.. సీన్ కట్ చేస్తే.. ఆ యూనివర్సిటీ ఏకంగా రూ. 99 కోట్లు నష్ట పరిహారం కట్టమని ఆమెను ఆదేశించింది. ఈ వ్యవహారం అక్టోబర్ 2021లో జరగగా.. ఇంతకీ ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వివరాల్లోకి వెళ్తే.. కోల్‌కతాలోని సెయింట్ జేవియర్స్ యూనివర్సిటీలో చదువుతున్న 18 ఏళ్ల యువకుడు.. తన యూనివర్సిటీకి చెందిన మహిళా ప్రొఫెసర్ బికినీ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో చూడటం, వాటికి లైక్ కొట్టడాన్ని అతడి తండ్రి గమనించాడు. తన కొడుకు చేస్తున్న పనికి కోపం కట్టెలు తెంచుకుని రావడంతో.. వెంటనే యూనివర్సిటీకి వెళ్లి సదరు ప్రొఫెసర్‌పై ఫిర్యాదు చేశాడు. ‘పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ప్రొఫెసర్.. లోదుస్తులతో ఫోటోలు దిగి.. వాటిని సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేయడం ద్వారా తన స్టూడెంట్స్‌కు ఏం చెప్పాలనుకుంటున్నారు.? ఇది చాలా అవమానకరం, అసభ్యకరమైన చర్య.’ అంటూ కంప్లయింట్‌లో పేర్కొన్నాడు సదరు విద్యార్ధి తండ్రి.
ఈ వ్యవహారంపై యూనివర్సిటీ తీవ్రంగా స్పందించింది. ఆమె చేసిన ఈ అసభ్యకరమైన చర్య వల్ల వర్సిటీకి చెడ్డపేరు వచ్చిందని.. కోలుకోలేని నష్టం జరిగిందంటూ ఆమెను వర్సిటీ సిబ్బంది ఉద్యోగం నుంచి తీసేశారు. అయితే దీనిపై సదరు మహిళా ప్రొఫెసర్ స్పందిస్తూ.. సదరు ఫిర్యాదు లేఖను తనకు చదివి వినిపించి.. ఉద్యోగం నుంచి తప్పుకోవాలంటూ తనపై ఒత్తిడి తీసుకొచ్చారని.. తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాల్సి వచ్చిందని ఆమె వివరించారు.
యూనివర్సిటీ డ్రెస్ కోడ్ విషయంలో తాను ఎప్పుడూ హద్దు దాటలేదని ఆమె చెప్పింది. బికినీ ఫోటోలు ఉన్న ఇన్‌స్టా ప్రొఫైల్ పబ్లిక్ కాదని.. ప్రైవేటు అకౌంట్ అని.. దాన్ని ఎవరో హ్యాక్ చేసినట్లు ఉన్నారని.. అందుకే ఆ ఫోటోలు లీకయ్యాయని తెలిపింది. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని స్పష్టం చేసింది. సదరు విద్యార్ధి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు కాపీని అందజేయాలంటూ విశ్వవిద్యాలయానికి నోటీసులు పంపింది. అయితే ఇందుకు సమాధానంగా ‘ అసభ్యకరమైన చర్య వల్ల వర్సిటీకి తీవ్ర నష్టం వాటిల్లింది. దీనికి బేషరతుగా క్షమాపణలు చెప్పి.. నష్టపరిహారంగా రూ. 99 కోట్లు చెల్లించాలి’ అని యూనివర్సిటీ సిబ్బంది ఆమెకు నోటిసులు జారీ చేసింది. కాగా, దీనిపై ప్రొఫెసర్ తనకు న్యాయం జరిగేందుకు హైకోర్టును ఆశ్రయించనున్నట్లు పేర్కొంది.