అసలే కోతులు.. ఆపై వనం వీడి జనంలోకి వచ్చాయి. ఇంకేముంది..! ఊరంతా తిరుగుతూ.. మనుషులపైనే తిరగబడుతున్నాయి. అవి మనకు ఎదురొచ్చినా, మనం వాటికి ఎదురెళ్లినా అంతే సంగతులన్నట్టు ఉంది పరిస్థితి. ఈ కోతుల స్వైరవిహారంతో బెంగళూరు రూరల్ జిల్లా దొడ్డబల్లాపూర్ తాలూకా తూబాగెరె గ్రామం వాసులు హడలిపోతున్నారు. సందు దొరికితే ఇంట్లోకి దూరుతున్న కోతులు ఏవి దొరికితే అవి ఎత్తుకుపోతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి.. ఇంట్లో ఐఫోన్‌కి ఛార్జింగ్ పెట్టగా.. సైలెంట్‌గా వచ్చి దాన్ని తీసుకున్న కోతి.. మొబైల్‌ను తీసుకెళ్లి టవర్ పైకి ఎక్కి కూర్చుంది. దీంతో ఆ ఫోన్ ఓనర్ బాధ అంతా ఇంతా కాదు. కోతి నుంచి ఫోన్ తిరిగి తీసుకునేందుకు అతనికి ముప్పు తిప్పలు ఎదురయ్యాయి. జనాలు పోగయ్యి అందరూ గట్టిగట్టిగా కేకలు వేయడంతో.. చాలాసేపటి తర్వాత ఎట్టకేలకు ఫోన్‌ను కిందకు జారవిడిచింది కోతి. అయితే ఫోన్‌కు స్వల్ప డ్యామేజ్ అయినట్లు తెలిసింది
గ్రామంలో నిత్యం ఇళ్లకు కోతులు గుంపులు గుంపులుగా వస్తున్నాయి… ఇంట్లో దొరికిన వస్తువులను తీసుకెళ్తున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకుని.. తమ వానరాల నుంచి రక్షణ కల్పించాలంటున్నారు. కాగా కోతి ఐఫోన్ తీస్కోని టవర్ ఎక్కిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా ఇలా తమ గ్రామంలో ఎక్కడ చూసినా కోతులే కోతులని తూబాగెరె గ్రామం వాసులు బాధను వ్యక్తపరుస్తున్నారు. ఇళ్లు, పొలం, గుడిబడీ ఎక్కడ చూసినా కోతుల గుంపులే. గ్రామాల్లో స్వైరవిహారం చేస్తూ ఈ వానరాలు సృష్టిస్తున్న రచ్చ అంతా ఇంత కాదు. బైక్స్ సీట్స్ కవర్లు చింపేయడం, విలువైన పత్రాలు ఎత్తుకుపోవడం, ఇళ్లల్లోకి చొరబడి ఆహారం లాక్కెళ్లిపోతుండటంతో జనం హడలిపోతున్నారు. కోతుల బెడద నుంచి తమను కాపాడేవాడే లేడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకపోయిందంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..