ఇప్పుడు ఏ ఇద్దరు మాట్లాడుకున్నా టమాట ప్రస్తావన రావాల్సిందే. కిలో టమాట ధర ఏకంగా రూ. 150 దాటేసింది. కొన్ని చోట్ల అయితే రూ. 200కి చేరువుతోంది. దీంతో ప్రజలు టమాట అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. వంటల్లో టమాటను తగ్గించేశారు. ఇదిలా ఉంటే ఓవైపు టమాట ధర కంట తడి పెట్టిస్తుంటే దానికి సంబంధించిన మీమ్స్ నవ్వులు పూయిస్తున్నాయి. టమాటపై బోలెడన్నీ జోకులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. టమాటను బంగారం, డైమండ్‌తో పోల్చుతూ చేస్తున్న మీమ్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే టమాట ధరలను తన మార్కెటింగ్ స్ట్రాటజీగా మార్చుకున్నాడు ఓ మొబైల్ షాప్ ఓనర్. తన దుకాణంలో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే 2 కిలోల టమాటాలు ఉచితంగా ఇస్తానని ఆఫర్ ప్రకటించాడు. ట్రెండింగ్‌లో ఉన్న టమాటను పబ్లిసిటీ కోసం వాడుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని అశోక్ నగర్‌లో అశోక్ అగర్వాల్ అనే యువకుడు మొబైల్ షాప్‌ను నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే పెరిగిన టమాట ధరలను తన షాప్ ప్రచారానికి వాడుకోవాలనుకున్నాడు.
అనుకున్నదే తడవుగా తన దుకాణంలో స్మార్ట్ ఫోన్ కొంటే 2 కిలోల టమాట ఫ్రీ అంటూ ఫ్లెక్సీలో వేశాడు. దీంతో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారంతా అశోక్ దుకాణానికి క్యూ కడుతున్నారు. ఈ ప్రకటన తర్వాత తన షాపులో అమ్మకాలు పెరిగాయని చెప్పుకొచ్చాడు అశోక్.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..