Miss Universe 2021 winner Harnaaz Sandhu: 20 ఏళ్ల భారత్ ఎదురుచూపులు ఫలించాయి. 21 సంవత్సరాల అమ్మాయి హర్నాజ్ కౌర్ మిస్ యూనివర్స్ 2021 కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. 70వ మిస్ యూనివర్స్ పోటీల్లో.. 80 మంది అందాల భామలు తలపడ్డారు. తన అందంతో ఒక్కొక్కరినీ దాటుకుంటూ.. జడ్జిల మనసు గెలుచుకుంటూ విశ్వసుందరిగా నిలిచింది పంజాబ్‌లో పుట్టిన హర్నాజ్ కౌర్ సంధు.
హర్నాజ్ కౌర్ విశ్వసుందరి కిరీటాన్ని సొంతం చేసుకోవడంతో 20 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. 20 ఏళ్ల తర్వాత భారత్‌కు మరోసారి విశ్వసుందరి కిరీటం దక్కింది. ఇజ్రాయెల్ లో జరిగిన 70వ మిస్ యూనివర్స్ పోటీల్లో ఈ కిరీటాన్ని సొంతం చేసుకున్నారామె.
రోజూ ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను ఎలా ఎదుర్కోవాలి? యువతులకు మీరు ఏ సలహా ఇస్తారు? ఈ ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం ఏంటో తెలుసా.? ఎవరైనా.. తమకు తాము ప్రత్యేకమే అని తెలుసుకోవాలి, ఇతరులతో పోల్చుకోవడం మానేయాలని సూచించారు. మీ జీవితానికి మీరే నాయకుడని.. అందుకే తాను ఇక్కడ నిలబడ్డానంటూ.. హుందాగా సమాధానం ఇచ్చారు.
ఆ తర్వాత వాతావరణ మార్పు ఒక బూటకమని అంటుంటారు. దీనికి మీరిచ్చే సమాధానం ఏంటీ అనే ప్రశ్న ఎదురైంది. అయితే అసలే ప్రకృతి ఎంతో ప్రేమ చూపించే హర్నాజ్.. ఎంతో బాధ్యతాయుతంగా సమాధానం చెప్పింది. ప్రకృతిలో చాలా సమస్యలున్నాయని తెలిసి తన గుండె పగిలిపోతోందన్నారు. ఇదంతా బాధ్యతారాహిత్యం వల్లే జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మనం చేసే ప్రతి చర్య ప్రకృతిని రక్షించగలదన్నారు.
ఆ తర్వాత కొంత సేపటికే హర్నాజ్‌ను విశ్వసుందరిగా ప్రకటించడంతో.. ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. తలపై కిరీటాన్ని పెడుతున్న సమయంలోనూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. దాదాపు 80 మంది పోటీదారులతో పోటీపడి కిరీటాన్ని దక్కించుకుంది హర్నాజ్ కౌర్ సంధు.
ఎంత సన్నగా ఉందో! గాలొస్తే ఎగిరిపోతుంది!! అని ఒకప్పుడు హేళన చేసేవారామెను. స్కూల్లో తోటివిద్యార్థులు పదేపదే తనపై వేసే జోకులను మౌనంగా భరిస్తూ.. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడే అమ్మాయి హర్నాజ్ కౌర్ సింధు. కుటుంబం మద్దతుగా నిలవడంతో.. మోడలింగ్‌లో రాణిస్తూ, సినిమాల్లో నటిస్తూ ఏకంగా మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకునే స్థాయికి ఎదిగింది.
ఇప్పటిదాకా ఇండియాకు రెండుసార్లు మాత్రమే మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. గతంలో మిస్ యూనివర్స్ పోటీలకు ఇండియా నుంచి సుస్మితా సేన్, లారా దత్తా, సెలీనా జైట్లీ, నేహా దుపియా పోటీపడ్డారు. కానీ 1994లో సుస్మితాసేన్, 2000లో లారా దత్తా మాత్రమే మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు.
హర్నాజ్ కౌర్ సంధు ఎవరు?
21 ఏళ్ల హర్నాజ్ కౌర్ సంధు చంఢీఘర్‌లోని పంజాబీ కుటుంబంలో 2000 సంవత్సరంలో జన్మించారు. శివాలిక్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్య.. తరువాత ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ పూర్తైంది. ప్రస్తుతం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది.
చిన్నప్పటి నుంచి యోగా మీద ఆసక్తి చూపించడమే కాకుండా.. ఫిట్‌నెస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవారు. గుర్రపు స్వారీ, స్విమ్మింగ్, డ్యాన్స్, యాక్టింగ్, ట్రావెలింగ్‌ను అమితంగా ఇష్టపడేవారు.
చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక తనది.. దీంతో 17 ఏళ్లకే మోడలింగ్‌లో అడుగుపెట్టింది. కాలేజీలో తొలి స్టేజ్ ప్రదర్శనతో తన మోడలింగ్ జర్నీ ప్రారంభమైంది. ఒకపక్క మోడలింగ్ చేస్తూనే అనేక ఫ్యాషన్ షోల్లో పాల్గొనేది. ఈ క్రమంలోనే అందాల పోటీల్లో పాల్గొని 2017లో ‘మిస్ చంఢీఘర్’ కిరీటాన్ని గెలుచుకుంది. 2019లో మిస్ పంజాబ్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. 2019లో ‘మిస్ ఇండియా’ టైటిల్ కోసం పోటీ పడి టాప్–12 జాబితాలో నిలిచింది. ఆ తరువాత ‘మిస్ దివా యూనివర్స్ ఇండియా–2021’ కిరీటాన్ని సొంతం చేసుకుంది.
హార్నాజ్‌కు ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. అందుకే పర్యావరణాన్ని కాపాడండి అని గొంతెత్తి చెబుతోంది. ఇప్పటిదాకా పాల్గొన్న అందాల పోటీల్లో పర్యావరణంపై అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబుతూ న్యాయ నిర్ణేతల మనసులు గెలుచుకుంది.
Also Read..
Rashmika Mandanna: బ్లాక్ శారీలో మైండ్ బ్లాక్ చేసిన నేషనల్ క్రష్.. ‘పుష్ప’ ఈవెంట్‌లో మెరిసిన రష్మిక
Viral Video: పెళ్లి వేడుకలో షాకింగ్ ఘటన.. వైరల్ అవుతున్న వీడియో.. అయ్యో పాపం అంటున్న నెటిజన్లు..!