
సృష్టిలో జీవుల వింతలు, విశేషాలకు అంతం ఉండదు. తమ పార్ట్‌నర్‌ను ఆకట్టుకోవడానికి రకరకాల పక్షులు చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తుంటాయి. అయితే మధ్య, దక్షిణ అమెరికాలోని ఉష్ణమండల అడవుల్లో కనిపించే రెడ్ క్యాప్డ్ మనాకిన్ అనే ఒక చిన్న పక్షి చేసే డ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. మైకేల్ జాక్సన్ ప్రసిద్ధ మూన్‌వాక్ డ్యాన్స్‌ను తలపించేలా ఈ పక్షి కొమ్మపై జారే అద్భుతమైన దృశ్యాలు @best_birds_shots అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో వైరల్‌గా మారాయి.
సంతానోత్పత్తి కాలంలో ఆడ పక్షులను ఆకర్షించేందుకు మగ మనాకిన్ పక్షులు ఈ ప్రత్యేకమైన డ్యాన్స్ రూటిన్‌ను ప్రదర్శిస్తాయి. డ్యాన్స్ చేయడానికి మగ పక్షి ముందుగా ఒక సన్నని చెట్టు కొమ్మను ఎంచుకుంటుంది. ఆడ పక్షి దగ్గరకు రాగానే తన ప్రదర్శనను ప్రారంభిస్తుంది. ఈ డ్యాన్స్‌లో వేగవంతమైన గెంతులు, రెక్కల చప్పుడు, చిన్నపాటి విమాన విన్యాసాలు, వీటన్నింటికీ మించి పర్‌ఫెక్ట్ మూన్‌వాక్ ఉంటాయి. పక్షి తన శరీరాన్ని అస్సలు కదల్చకుండా, కాళ్లతో కొమ్మపై వేగంగా ముందుకు వెనుకకు జరుగుతుంటే.. ఏదో మాయాజాలం జరుగుతున్నట్లే అనిపిస్తుంది.
సాధారణంగా చాలా పక్షి జాతుల్లో మగ పక్షులు గూడు కట్టడం, గుడ్లను పొదగడం లేదా పిల్లలను పెంచడంలో సహాయపడతాయి. కానీ రెడ్ క్యాప్డ్ మనాకిన్ పక్షుల్లో మగవి ఈ పనులేవీ చేయవు. ప్రత్యుత్పత్తి ప్రక్రియలో మగ పక్షి వహించే ఏకైక పాత్ర.. ఆడ పక్షిని డ్యాన్స్‌తో ఆకట్టుకోవడం మాత్రమే. అందుకే తమ శారీరక ధృఢత్వాన్ని, కచ్చితమైన టైమింగ్‌ను నిరూపించుకోవడానికి ఇవి డ్యాన్స్‌పైనే పూర్తిగా ఆధారపడతాయి.
ఈ పక్షులు భాగస్వామి కోసం ఒకదానితో ఒకటి పోరాడుకోవు. దానికి బదులుగా లెక్ అని పిలిచే ఒక ప్రాంతంలో అనేక మగ పక్షులు చేరి, వచ్చే ఆడ పక్షుల ముందు తమ డ్యాన్స్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి. ఎవరి డ్యాన్స్ అయితే అత్యంత స్మూత్‌గా, టైమింగ్‌తో సరిగ్గా ఉంటుందో.. ఆ పక్షినే ఆడ పక్షి తన భాగస్వామిగా ఎంచుకుంటుంది. మానవ కంటికి ఈ పక్షి మూమెంట్స్ చాలా వేగంగా కనిపిస్తాయి కాబట్టి వైరల్ అవుతున్న స్లో మోషన్ వీడియోల ద్వారానే వీటి డ్యాన్స్ ప్రతిభ ఎంత అద్భుతంగా ఉందో ప్రపంచానికి స్పష్టంగా తెలుస్తోంది.