
నేటి కాలంలో పెళ్లి సంబంధాల ఎంపిక చాలా క్లిష్టంగా మారుతోంది. ఆశలు, అంచనాలు పెట్టుకోవడం సహజమే అయినప్పటికీ, కొన్నిసార్లు అవి మితిమీరిన అవాస్తవిక డిమాండ్ల రూపం దాల్చినప్పుడు సంబంధాలు కుదరడం అసాధ్యంగా మారుతుంది. సరిగ్గా ఇలాంటి ఒక విచిత్రమైన అనుభవాన్ని ప్రముఖ మ్యాచ్‌మేకర్, డేటింగ్ కోచ్ ఓయెండ్రిలా కపూర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రూ.11 లక్షల ప్యాకేజీ ఉన్న అమ్మాయి, కోటి రూపాయల ప్యాకేజీ ఉన్న వరుడే కావాలని పట్టుబట్టడంతో, చివరకు ఆ మ్యాచ్‌మేకర్ ఆమె ప్రొఫైల్‌ను తిరస్కరిస్తూ లిస్ట్ నుండి తొలగించారు.
మ్యాచ్‌మేకర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒక 28 ఏళ్ల యువతి పెళ్లి సంబంధం కోసం తనను సంప్రదించింది. మొదట్లో ఆమె కుటుంబ సభ్యులు అబ్బాయి మంచి సంస్కారం ఉన్నవాడై, మంచి కుటుంబ నేపథ్యం కలిగి ఉండి, విద్యావంతుడైతే చాలని సాధారణ నిబంధనలు పెట్టారు. కానీ, మ్యాచ్‌మేకింగ్ టీమ్ వరుసగా సంబంధాలు చూపించడం ప్రారంభించిన తర్వాత వారి అంచనాలు ఆకాశాన్ని తాకాయి. చివరకు సదరు అమ్మాయి తన వార్షిక ఆదాయం రూ.11 లక్షలు కాగా, తనకు కాబోయే భర్త కనీసం రూ.1 కోటి కంటే ఎక్కువ సంపాదిస్తూ ఉండాలని నిబంధన పెట్టింది.
కేవలం భారీ జీతం మాత్రమే కాకుండా, అబ్బాయి తప్పనిసరిగా బెంగాలీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవాడై ఉండాలని కఠినమైన షరతు విధించారు. ఆ మ్యాచ్‌మేకర్ బృందం యువతి ఎంపిక చేసిన కొన్ని ప్రొఫైల్స్ వారితో మాట్లాడినప్పటికీ, అవతలి వైపు నుండి ఎవరూ ఆసక్తి చూపించలేదు. ఎందుకంటే, అంత పెద్ద మొత్తంలో సంపాదించే వ్యక్తులు కేవలం డబ్బు మాత్రమే కాకుండా పరస్పర అవగాహన, ఆలోచనా విధానాలు కూడా సరిపోవాలని కోరుకుంటారు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో, చివరకు ఓయెండ్రిలా కపూర్ ఆ యువతి ప్రొఫైల్‌ను తన జాబితా నుండి తొలగించారు. ఈ ఉదంతాన్ని వివరిస్తూ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. భారీగా సంపాదించే పురుషులు కూడా తమ భాగస్వామిలో కేవలం అందం, డబ్బు కంటే మంచి ప్రవర్తన, పరిణతి చెందిన ఆలోచనలను కోరుకుంటారని హితవు పలికారు. ఇటువంటి అవాస్తవిక డిమాండ్లు, అనవసరమైన నిబంధనల వల్ల ఎంతో మంచి సంబంధాలను కోల్పోవాల్సి వస్తుందని నెటిజన్లు కూడా కామెంట్ల రూపంలో అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..