
చదువులు పూర్తయ్యాక ఉద్యోగ ప్రయత్నాలు అందరూ చేస్తుంటారు. ఆ ప్రయత్నాలలో కొందరు తొందరగానే సఫలీకృతం అవుతారు. మరి కొందరు మాత్రం ఎన్నో అవమానాలు, చీదరింపులను ఎదుర్కొంటారు. అలాంటి సందర్భాల్లోనే కొందరు యువకులు అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం లేదా ఉద్యోగ ప్రయత్నాలు ఆపేసి వేరే మార్గాలను ఎంచుకుంటారు. దాదాపుగా అందరూ పాటించే విధానమే ఇది. కానీ అడ్విన్ రాయ్ నెట్టో అనే కథ ఇందుకు పూర్తిగా విరుద్ధం. అతనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతను.. ఎక్కడైతే తనను కాదన్నారో.. ఎలాగైనా అక్కడే ఉద్యోగం సాధించాలనే మక్కవోని దీక్ష పూనాడు. అఖరికి అనుకున్న కంపెనీలోనే తాను కోరుకున్న ఉద్యోగమే సాధించాడు. టెక్ దిగ్గజం అయిన గూగుల్ కంపెనీలో ఉద్యోగం అంటే మాటలు కాదు. ఐటీ రంగంలో ఉన్న ప్రతి ఉద్యోగికి ఉండే ఆలోచన గూగుల్‌లో ఉద్యోగం సాధించాలని. అందులో ఉద్యోగం సాధించడం ఎంత కష్టమో.. సాధించిన తర్వాత ఉండే సంతోషం అంతకంటే రెట్టింపుగా ఉంటుంది.
అలాంటి కంపెనీలో ప్రోడక్ట్ డిజైనర్ ఉద్యోగం సాధించాడు కర్ణాటకకు చెందిన అడ్విన్ రాయ్ నెట్టో. అతను 2013 సంవత్సరం నుంచి ఆ కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే లెక్క లేనన్ని సార్లు కంపెనీ అధికారుల నుంచి తిరస్కరణకు గురయ్యాడు. కానీ ఎప్పుడు నిరుత్సాహపడలేదు, తన ప్రయత్నాలను విడిచిపెట్టలేదు. తనకు ఉద్యోగం రాకపోవడానికి కారణం.. ‘పెద్ద పెద్ద కాలేజీలలో చదివిన డిగ్రీ లేకపోవడమే’నని అనుకున్నాడు. కానీ తన ప్రయత్నం చేయడం ఆపకుండా తన స్కిల్స్‌ను పదును పెట్టి, రెస్యుమ్ మీద దృష్టి సారించాడు. చివరికి అనుకున్నట్లు గూగుల్‌లోనే ప్రోడక్ట్ డిజైనర్‌గా ఉద్యోగం సాధించాడు. దీనిపై తన సంతోషాన్ని, తన కుటుంబ సభ్యుల స్పందనను తెలియజేస్తూ ఒక వీడియోను నెట్టింట పోస్ట్ చేశాడు. దానికి అతను ‘‘ గూగుల్‌లో ఉద్యోగం పొందడానికి పెద్ద పెద్ద డిగ్రీలు అవసరం లేదు. మీరు చేయాలనుకున్న పనిని మెరుగ్గా చేయగలిగితే చాలు. మీరు సాధించేస్తారు’’ అంటూ కాప్షన్‌ను రాసుకొచ్చాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
‘‘ ప్రతివారం గూగుల్ సంస్థకు 70 వేల నుంచి లక్ష మంది తమ అప్లికేషన్లను పంపిస్తుంటారు. అలా వచ్చిన అప్లికేషన్ల నుంచి 144 మంది మాత్రమే ఉద్యోగాన్ని సాధిస్తారు. ఈ 144 మందిలొ మీరు కూడా ఉండాలంటే.. మీరు చేసే పనిలో మీ అభిరుచి ఏ స్థాయిదనేది చూపించాలి. అప్లికేషన్‌ను పంపే ముందే ఒక సారి సరిచూసుకోంది. మిమ్మల్ని మీరే ఇంటర్వ్యూ చేసుకోండి. మీకు తెలియని విషయాలకు ఇతరుల నుంచి సమాచారం అడిగి తెలుసుకోండి. చాలా మందికి సమయం ఉండకపోవచ్చు మీకు సమాచారం అందించడానికి. అంతటితో నిరుత్సాహపడకండి. ప్రయత్నిస్తూనే ఉండండి’’ అని యువకులకు సలహాగా కాప్షన్‌లో పెట్టాడు. నెట్టో పోస్ట్ చేసిన ఈ వీడియో నెటిజన్ల మనసులను హత్తుకుంది. ‘‘చాలా మంచి వీడియో. అందులోని నెట్టో కుటుంబ సభ్యుల నవ్వులను చూడండి. వాటికి వెల కట్టలేము. యూ మేడ్ మై డే నెట్టో’’ అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.