AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేకప్ వేసుకున్నా.. జుట్టు కనిపించినా సమస్యే! తాలిబన్ల వింత ఆంక్షలు

అఫ్గానిస్థాన్‌లో మహిళలపై తాలిబన్ల ఆంక్షలను ఎత్తిచూపుతూ ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. మేకప్ వేసుకున్నా, రంగురంగుల స్కార్ఫ్ ధరించినా, జుట్టు కనిపించినా, పురుషుడు వెంట లేకుండా బయటకు వచ్చారనీ వింత కారణాలతో మహిళలను అదుపులోకి తీసుకుంటున్నారనీ తెలిపింది. జూలై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో 52 మంది మహిళలు, ఒక బాలికను తాలిబన్లు అరెస్ట్‌ చేసినట్లు తెలిపింది.

మేకప్ వేసుకున్నా.. జుట్టు కనిపించినా సమస్యే! తాలిబన్ల వింత ఆంక్షలు
Women Arrested In Afghanistan For Make Up Other Strange Reasons
Sharada V
|

Updated on: Oct 10, 2026 | 8:16 PM

Share

రాజధాని కాబూల్‌తో పాటు పశ్చిమ అఫ్గానిస్థాన్‌లోని హెరాత్ లో అరెస్ట్‌ లు జరిగినట్లు ఐక్యరాజ్యసమితి అఫ్గానిస్థాన్ సహాయ మిషన్ (UNAMA) వెల్లడించింది. మహిళల దుస్తులు, బహిరంగ ప్రదేశాల్లో వారి ప్రవర్తనపై తాలిబన్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. చాదర్ ధరించకపోవడం, జుట్టు బయటకు కనిపించడం, రంగురంగుల స్కార్ఫ్‌లు కట్టకూడదనీ, మేకప్ వేసుకోవద్దనీ మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు UNAMA తెలిపింది. దగ్గరి బంధువు పురుషుడు లేకుండా బయటకు వెళ్లిన మహిళలపైనా చర్యలు తీసుకుంటున్నారు. మహిళలను వేధించడం, కొట్టడం, అరెస్టు చేస్తామని బెదిరించడం చేస్తున్నారనీ మహిళా దుకాణదారులను సైతం వేధింపులకు గురి చేస్తున్నట్లు నివేదికలో తెలిపింది.

మహిళల దుస్తులు, మాటలపైనా ఆంక్షలు

2024లో తాలిబన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దురాచారాల నివారణ చట్టం’ మహిళల దుస్తులు, ప్రవర్తనపై అనేక నిబంధనలు విధించింది. ఈ చట్టంలోని ఆర్టికల్ 13 ప్రకారం.. మహిళలు తమ శరీరాన్ని పూర్తిగా కప్పుకోవాలి. వివాదాలు తలెత్తకుండా ముఖాన్ని కప్పుకోవాలి. కొన్ని బహిరంగ సందర్భాల్లో మహిళలు పాటలు పాడటం, గట్టిగా చదవడం లేదా సమూహాల్లో బిగ్గరగా మాట్లాడటం పైనా పరిమితులు విధించింది. దుస్తులు పలుచగా, పొట్టిగా, బిగుతుగా ధరించకూడదు. దగ్గరి బంధువులు కాని వ్యక్తుల ముందు మహిళలు తమ శరీరాన్ని, ముఖాన్ని కప్పుకోవాలని చట్లం చేసారు.

హెచ్చరికల నుంచి అరెస్టుల వరకు..

ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లు భావిస్తే హెచ్చరికలు జారీ చేయడం, జరిమానాలు విధించడం, అదుపులోకి తీసుకోవడం చేస్తున్నారు. 2021లో మళ్లీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాలిబన్ ప్రభుత్వం మహిళలు, బాలికలపై ఆంక్షలను క్రమంగా పెంచింది. బాలికలు ప్రాథమిక విద్య తో చదువు ఆపేయాలని నిషేధం తెచ్చారు. మహిళల స్వేచ్ఛగా తిరగడం, కార్యక్రమాల్లో పాల్గొనడంపై పరిమితులను విధించింది.

హెరాత్‌లో నిరసన.. కాల్పులతో ఉద్రిక్తత

మహిళల దుస్తుల నిబంధనల పేరుతో జరుగుతున్న అరెస్టులపై హెరాత్‌లో గత జూన్‌లో నిరసన వ్యక్తమైంది. ఆందోళన సమయంలో తాలిబన్ అధికారులు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు, UNAMA తెలిపింది. ఈ ఘటనలో కనీసం ఒకరు మరణించగా, పలువురు గాయపడ్డారు. మహిళల దుస్తులపై, బయటకు వెళ్లే స్వేచ్ఛపై, బహిరంగంగా మాట్లాడే హక్కులపై ఇలాంటి ఆంక్షలు కొనసాగుతుండటంపై UNAMA తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Follow Us