Metro Rail: వర్షం బయట.. వరద లోపల.. మెట్రో ప్రయాణించాలంటే ‘రెయిన్ కోట్’ తప్పనిసరి!

మహారాష్ట్రలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పూణే నగరంలో ట్రాఫిక్ కష్టాల నుంచి ఊరటనిచ్చేందుకు ప్రారంభించిన ‘పూణే మెట్రో’ ప్రస్తుతం ఒక వివాదాస్పద సంఘటనతో వార్తల్లో నిలిచింది. కోట్ల రూపాయల వ్యయంతో, అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన ఈ మెట్రో రైలు.. తొలి రుతుపవన వర్షాలకే తన డొల్లతనాన్ని బయటపెట్టుకుంది.

Metro Rail: వర్షం బయట.. వరద లోపల.. మెట్రో ప్రయాణించాలంటే ‘రెయిన్ కోట్’ తప్పనిసరి!
Pune Metro Passengers

Updated on: May 24, 2026 | 8:58 AM

మహారాష్ట్రలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పూణే నగరంలో ట్రాఫిక్ కష్టాల నుంచి ఊరటనిచ్చేందుకు ప్రారంభించిన ‘పూణే మెట్రో’ ప్రస్తుతం ఒక వివాదాస్పద సంఘటనతో వార్తల్లో నిలిచింది. కోట్ల రూపాయల వ్యయంతో, అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన ఈ మెట్రో రైలు.. తొలి రుతుపవన వర్షాలకే తన డొల్లతనాన్ని బయటపెట్టుకుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, మెట్రో కోచ్‌ల నిర్మాణ నాణ్యత మరియు ప్రయాణికుల భద్రతపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో, కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఒక మెట్రో రైలు కోచ్ పైకప్పు నుండి నీరు నిరంతరాయంగా కిందకు కారుతోంది. బయట కురుస్తున్న వర్షానికి ఏమాత్రం తీసిపోని విధంగా రైలు లోపల నీటి చుక్కలు పడుతుండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దయనీయ పరిస్థితి కారణంగా, ఎండనక వాననక సురక్షితంగా ప్రయాణించవచ్చని మెట్రో ఎక్కిన ప్రయాణికులు.. విధిలేక రైలు లోపల కూడా గొడుగులు విప్పాల్సి వచ్చింది. అయితే, సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ వీడియో ప్రామాణికతను టీవీ9 స్వతంత్రంగా ధృవీకరించడంలేదు.

వైరల్ వీడియో ఇక్కడ చూడండి..

పూణే నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడాలని, ట్రాఫిక్ సమస్యలు తగ్గాలని స్థానిక నివాసితులు చాలా కాలంగా మెట్రో కోసం డిమాండ్ చేశారు. మెట్రో సేవలు ప్రారంభం కావడంతో ఎంతో సంతోషించిన ప్రజలకు ఈ దృశ్యాలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించాయి. ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణించే ఈ వ్యవస్థ, సాధారణ వర్షాలను కూడా తట్టుకోలేకపోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రారంభ దశలోనే సరికొత్త మెట్రో కోచ్‌ల పరిస్థితి ఇలా ఉంటే, రాబోయే రోజుల్లో ఇవి పాతబడినప్పుడు ప్రయాణికుల భద్రతకు గ్యారెంటీ ఏమిటి?” అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా షేర్ అవుతోంది. ఇంతటి నిర్లక్ష్యానికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే లీకేజీ సమస్యను వెంటనే సరిదిద్ది ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించాలని పూణే ప్రజలు మెట్రో యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us