చైనాలో జరిగిన ఓ సంఘటన ఒళ్లు జలదరించేలా చేస్తుంది. రక్తాన్ని పీల్చే జలగలు ఓ వ్యక్తి శరీరంలో ఆవాసం ఏర్పాటు చేసుకుని నెలల తరబడి అతని ఒంట్లోనే మకాం వేశాయి. చివరకు అతడు అనారోగ్యానికి గురికావడంతో..వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు విషయం తెలిసి ఖంగుతిన్నారు. ఎట్టకేలకు అతనికి శస్త్రచికిత్సలు నిర్వహించి వాటిని బయటకు తీశారు. బాధితుడు రెండు నెలలుగా తీవ్రమైన దగ్గుతో బాధపడుతూ ఒకరోజు..నోట్లోంచి రక్తం పడడంతో ప్యూజిన్ ఫ్రావిన్స్‌లోని వుపింగ్ కౌంటీ ఆస్పత్రి వైద్యులను సంప్రదించాడు. దీంతో శ్వాసకోశ విభాగానికి సంబంధించిన వైద్యులు అన్ని పరీక్షలు నిర్వహించారు. సిటీ స్కాన్ చేసినా ప్రయోజనం లేకపోవడంతో చివరకు బ్రాంకోస్కోపీ పరీక్ష నిర్వహించగా..డాక్టర్లకే షాక్ ఇచ్చే విషయం ఒకటి గుర్తించారు. ఆ వ్యక్తి గొంతు, ముక్కు భాగంలో రెండు జలగలు ఉన్నట్లుగా ఆ రిపోర్టులో తేలింది. దీంతో అతడికి వెంటనే ట్వీజర్ సాయంతో ఆపరేషన్ నిర్వహించారు. 1.2 ఇంచులు గల రెండు జలగలను బయటికి తీశారు. ప్రస్తుతం ఆ వ్యక్తి కోలుకుంటున్నట్లుగా వైద్యులు తెలిపారు. బాధితుడి శరీరంలో ఉన్న జలగలు..కంటికి కనిపించనంత పరిమాణంలో ఉండటంతో వాటిని గుర్తించలేకపోయినట్లుగా వారు వెల్లడించారు.