‘ము..ము…ము.. ముద్దంటే చేదా… నీకావుద్దేశం లేదా?’.. ముద్దుని స్వీట్‌తో పోలుస్తారు. తమకి నచ్చినవారిని, తాము ఇష్టపడినవారికి ప్రేమను తెలియపరిచేందుకు వారి భాగస్వాములు ఓ ముద్దు ఇస్తారు. అయితే మీరెప్పుడైనా ముద్దుల వ్యాధి గురించి విన్నారా.! ఏంటి.? అలాంటి ఓ డిసీజ్ కూడా ఉందని ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ వ్యాధిని మోనోన్యూక్లియోసిస్(Mononucleosis Disease).. దీన్ని చాలామంది కిస్సింగ్ వ్యాధి అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి లాలాజలం ద్వారా వ్యాపిస్తుంది.
ముద్దు పెట్టుకోవడం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. దీని మందు ఏమి లేదని వైద్య నిపుణులు అంటున్నారు. కాబట్టి మీలో ఒకవేళ కిస్సింగ్ వ్యాధి లక్షణాలు కనిపిస్తే.. కొద్దిరోజులు ముద్దులు ఆపేయాలని సలహా ఇస్తున్నారు. పైన పేర్కొన్న ముద్దుల వ్యాధి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇది ఎప్స్టీన్‌బారే వైరస్‌తో వస్తుంది. ఇది ఎలాంటి లక్షణాలు లేకుండానే రోగి శరీరంలోకి వ్యాపిస్తుంది. ఈ వైరస్ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి లాలాజలం, నీరు లేదా పంచుకునే వస్తువుల ద్వారా వ్యాపిస్తుంది. అలాగే రక్తం లేదా వీర్యంతో కూడా ఇది వ్యాప్తి చెందుతుంది.
విపరీతమైన అలసట, జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కాలేయం లేదా ప్లీహము వాపు, దద్దుర్లు వంటివి ఈ వ్యాధి లక్షణాలు. కాగా, ఈ వ్యాధిని రక్త పరీక్ష, యాంటీ బాడీ పరీక్షల ద్వారా గుర్తిస్తారు. స్వీయ జాగ్రత్తల ద్వారా కూడా దీన్ని నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఒకవేళ మీకు జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి ఉంటే ముద్దు పెట్టుకోకపోవడం మంచిది.