Sabarimala: అయ్యప్ప స్వాములూ.. జర భద్రం! కలవరపెడుతోన్న ప్రాణాంతక వైరస్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
మండల పూజల వేళ, రోజుకు 75 వేల మందికి పైగా భక్తులతో కిటకిటలాడుతున్న వేళ, శబరిమల అయ్యప్ప సన్నిధానంలో ఒకానొక ఫికర్. కానీ, బేఫికర్ అంటోంది ప్రభుత్వం. ప్రాణాంతకమైన వైరస్ ఒకటి భయపెడుతున్నా, జర అప్రమత్తంగా ఉంటే చాలంటోంది కేరళ సర్కార్. ఇంతకీ శబరిమలై యాత్రీకుల్ని కలవరపెడుతున్న ఆ ఫియర్ ఏంటో? దాంతో ఎంత డేంజర్?

అయ్యప్ప స్వాములూ.. జర భద్రం! నదుల్లో గానీ, చెరువుల్లో గానీ స్నానానికి దిగేముందు కొన్ని జాగ్రత్తలు పాటించండి. లేదంటే ఇక్కట్లు తప్పవు.. శబరిమలై యాత్రీకులకు ఈమేరకు అలర్ట్ నోటీస్ జారీ ఔతోంది. మండలపూజలు మొదలై మకర జ్యోతి కోసం ఎదురుచూస్తున్న సమయంలో లక్షలాదిమంది భక్తుల్లో ఇదో చిన్నపాటి కలవరం.. దాని పేరే బ్రెయిన్ ఈటింగ్ అమీబా. నదులు, చెరువుల్లో ఉండే బ్రెయిన్ ఈటింగ్ అమీబా… స్నానం కోసం మునిగినప్పుడు ముక్కు ద్వారా శరీరంలో ప్రవేశిస్తుంది. వెంటనే అమీబిక్ మెనింగోఎన్‌సెఫాలిటిస్ అనే బ్రెయిన్ ఫీవర్ వస్తుంది. విపరీతమైన జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వాంతుల్లాంటి లక్షణాలు కనిపిస్తాయి. బాధితులు నిద్రలేమి సమస్యతో సతమతమౌతారు. అయ్యప్ప భక్తుల్లో బ్రెయిన్ ఫీవర్.. ఆందోళన కలిగిస్తోంది. కానీ, స్నానం సమయంలో ముక్కులోకి నీళ్లు చేరకుండా జాగ్రత్తలు తీసుకుంటే దీని బారిన పడకుండా తప్పించుకోవచ్చు.
ఒకవేళ బ్రెయిన్ ఈటింగ్ అమీబా సోకినా, చిన్నచిన్న చిట్కాలతో త్వరగా రిలీఫ్ పొందే ఛాన్సుంది. వేడినీటిని మాత్రమే తీసుకోవడం, భోజనానికి ముందు చేతులు శుభ్రం చేసుకోవడం తప్పనిసరి అని, తీవ్ర జ్వరం ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని అయ్యప్ప భక్తులకు సూచనలు చేసింది కేరళ ప్రభుత్వం. ఒకవేళ అమీబా మెదడులోకి చేరితే మాత్రం పరిస్థితి ప్రాణాంతకంగా మారవచ్చు. కానీ, ఇది ఒకరి నుంచి మరొకరికి సోకదని భరోసానిస్తున్నారు వైద్యులు. కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసులు పెరుగుతున్నట్టు కూడా అక్కడి సర్కార్ నిర్ధారించింది. గత 11 నెలల్లో 170 మంది ఈ వ్యాధి బారిన పడితే, అందులో 41 మంది చనిపోయారు. నవంబర్ నెలలోనే 17 మంది ఈ వ్యాధి బారినపడగా ఎనిమిది మందిని బలితీసుకుంది. ఈ వారం రోజుల్లోనే 5 లక్షల మంది భక్తులు కొండకు వచ్చినట్టు అంచనా ఉంది. మండలపూజలు జరిగే 41 రోజుల్లో భారీగా భక్తుల రాబోతున్నారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు, కేరళ సర్కార్ అప్రమత్తం కాక తప్పలేదు.
శబరిగిరులు ఎక్కేముందు పంబా నదిలో పుణ్యస్నానం చేయడం అయ్యప్ప భక్తులకు సెంటిమెంట్. ఆవిధంగా శరీరాన్ని, మెదడును శుద్ధి చేసుకుని స్వామి దర్శనానికి వెళతారు. పంబ, కల్లార్, అళుత నదుల సంగమంలో ఐతే ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు స్నానమాచరిస్తారు. సో, శబరిమల యాత్రీకులు సరైన ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. బ్రెయిన్ ఈటింగ్ అమీబా నుంచి తప్పించుకోవచ్చు.
