Viral: సూసైడ్ చేసుకునేందుకు వెళ్లిన మహిళను ఫాలో అయిన పెంపుడు కుక్క.. నదిలో దూకబోతుండగా…

|

Jun 29, 2024 | 5:39 PM

కుక్క అత్యంత నమ్మకమైన జంతువు అని చెబుతుంటారు. అది నిజం అనే సందర్భాలు ఎన్నో జరిగాయి. తాజాగా కర్నాటకలో జరిగిన ఓ సంఘటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇలాంటి ఘటనలు సినిమాలో మాత్రమే చూడగలం.. నిజం జీవితంలో చాలా అరుదు.

Viral: సూసైడ్ చేసుకునేందుకు వెళ్లిన మహిళను ఫాలో అయిన పెంపుడు కుక్క.. నదిలో దూకబోతుండగా...
Pet Dog (Representative image)
Follow us on

దక్షిణ కన్నడ జిల్లాలో ఓ సినిమాటిక్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది.  ఉప్పినంగడి వద్ద  నేత్రావతి నదిలో దూకేందుకు ప్రయత్నించిన వివాహితను పెంపుడు కుక్క రక్షించింది. ఉప్పినంగడి సమీపంలోని పిలిగూడకు చెందిన 36 ఏళ్ల మహిళ ఇటీవల తన భర్తతో గొడవపడి… ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో నాలుగు కిలోమీటర్లు నడిచి ఉప్పినంగడి వద్ద నేత్రావతి నదిలో దూకేందుకు యత్నించింది. అయితే పెంపుడు కుక్క ఆమె ప్రాణాలను కాపాడింది.

నాలుగు కిలోమీటర్లు వెంబడించిన పెట్ డాగ్…

గురువారం రాత్రి మహిళకు, ఆమె భర్తకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. అనంతరం.. ఆ మహిళ సూసైడ్ చేసుకుందామని నిర్ణయించుకుని ఇంటి నుంచి బయలుదేరి నేత్రావతి నది వైపు వెళ్లింది. ఆమెకు తెలియకుండా ఇంట్లోని పెంపుడు కుక్క ఆమెను వెంబడించింది. ఆ మహిళ వంతెనపై ఉన్న రిటైనింగ్ వాల్ ఎక్కి నేత్రావతి నదిలోకి దూకబోతుండగా.. కుక్క మహిళ చుడీదార్‌ను పట్టి కిందకు లాగి.. గట్టిగా అరవడం ప్రారంభించింది. కుక్క అదే పనిగా మొరిగే శబ్దాన్ని గమనించిన ఇద్దరు బైకర్లు సంఘటనా స్థలానికి చేరుకుని.. మహిళ నదిలోకి దూకకుండా అడ్డుకున్నారు. ఫలితంగా విషాదం తప్పింది. ప్రస్తుతం ఆ మహిళ తన స్నేహితురాలి నివాసంలో ఉంటోంది.

బెంగళూరుకు చెందిన సదరు మహిళకు పిలిగుడికి చెందిన యువకుడితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ఆమె భర్త వృత్తి రీత్యా మెకానిక్ అని, భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు తెలిపారు. పెంపుడు కుక్క యజమానురాలిని రక్షించిన ఘటన ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి.