
ఉద్యోగాల కోసం ప్రయత్నించే ప్రతి ఒక్కరూ ఇంటర్వ్యూలలో ఎదుర్కొనే అత్యంత సాధారణ ప్రశ్న మీరు మా కంపెనీలో ఎందుకు పనిచేయాలనుకుంటున్నారు?. ఈ ప్రశ్నకు దాదాపు అందరూ ముందుగానే కొన్ని కృత్రిమమైన, కంపెనీని పొగిడే సమాధానాలను సిద్ధం చేసుకుని వెళ్తుంటారు. అయితే, ఓ యువకుడు మాత్రం ఈ ప్రశ్నకు ఎలాంటి మోమాటాలు లేకుండా అత్యంత నిజాయితీగా సమాధానం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఆసక్తికరమైన ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ప్రముఖ సోషల్ మీడియా వేదిక అయిన రెడిట్ లో ఓ యూజర్ తన ఉద్యోగ ఇంటర్వ్యూ అనుభవాన్ని పంచుకున్నాడు. గత ఒక నెల రోజులుగా తాను సుమారు 7 నుంచి 8 కంపెనీలలో ఇంటర్వ్యూలు ఇస్తూ తీవ్ర మానసిక ఒత్తిడికి, అలసటకు గురయ్యానని తెలిపాడు. మళ్లీ మరో ఇంటర్వ్యూలో అదే పాత ప్రశ్న ఎదురుకావడంతో విసిగిపోయిన అతనికి ఇక ఏమైనా పర్వాలేదు అనే భావన కలిగింది. దీంతో ఎలాంటి ముసుగు లేకుండా తన మనసులోని మాటను బయటపెట్టాలని నిర్ణయించుకున్నాడు.
ఇంటర్వ్యూయర్ మీరు మా కంపెనీలో ఎందుకు పనిచేయాలనుకుంటున్నారు? అని అడిగినప్పుడు, ఆ యువకుడు దీర్ఘశ్వాస తీసుకొని ఇలా బదులిచ్చాడు..నిజం చెప్పాలంటే.. ఈ జాబ్ పోస్ట్ ద్వారా ఇక్కడ మంచి జీతం లభిస్తుంది. నాకు ప్రస్తుతం డబ్బు చాలా అవసరం. అలాగే, మీరు ఆశిస్తున్న ఈ పాత్రకు నేను సరిగ్గా సరిపోతానని, ఈ పనిని అత్యంత సమర్థవంతంగా నిర్వహించగలనని నాకు నమ్మకం ఉంది.
ఇలాంటి పచ్చి నిజం చెబితే తనను ఇంటర్వ్యూలో రిజెక్ట్ చేస్తారేమోనని ఆ యువకుడు మొదట భావించాడు. కానీ, ఊహించని విధంగా ఇంటర్వ్యూ తీసుకున్న మేనేజర్ ఆ సమాధానానికి సంతృప్తిగా తల ఊపారు. మీ నిజాయితీ మాకు చాలా నచ్చింది. చాలామంది ఇక్కడ ఏదో ఒక కట్టుకథ అల్లడానికి ప్రయత్నిస్తుంటారు అని మెచ్చుకున్నారు. ఈ నిజాయితీతో కూడిన సమాధానం తనకు ఉద్యోగం తెచ్చిపెడుతుందో లేదో తెలియదు గానీ, ఇంటర్వ్యూయర్ల నుంచి మాత్రం మంచి ప్రశంసలనే దక్కించుకుంది.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఉద్యోగాల కోసం ఇలాంటి అర్థం లేని ప్రశ్నలు అడగడం మానేయాలి, ఎవరికైనా చివరకు డబ్బు, వేతనం మాత్రమే ముఖ్యం అని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరు మాత్రం కార్పొరేట్ ప్రపంచంలో ఇలాంటి తెగింపు ప్రతి ఒక్కరికీ ఉండదని, నిజాన్ని నిర్భయంగా చెప్పిన ఆ యువకుడిని అభినందించాలి అని కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ, జాబ్ ఇంటర్వ్యూలలో సాధారణంగా ఎవరూ చెప్పని నిజం చెప్పి ఈ యువకుడు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారాడు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..