ప్రస్తుతం అన్ని రంగాల్లో పోటీ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. ఉద్యోగం సంపాదించాలంటే కష్టంగా మారిపోయింది. విద్యావంతులు ఎక్కువ కావడంతో విపరీతమైన పోటీ నెలకొంటోంది. దీంతో కంపెనీలు సైతం ఉద్యోగులను ఎంచుకోవడానికి రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఎన్నో ఫిల్టరేషన్స్ ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేస్తున్నాయి.
ఇక పోటీ ప్రపంచంలో ఉద్యోగం దక్కించుకోవడం సవాలుగా మారిన తరుణంలో ఉద్యోగార్థులు కూడా ఉద్యోగాన్వేషణ కోసం రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగానే రిక్రూటర్స్‌ను ఆకర్షించేందుకు కొంగొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి చేసిన వింత ఆలోచన అందరి దృష్టిని ఆకర్షించింది. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ వ్యవస్థాపకుడు తనకు వచ్చిన ఓ వింత ప్రపోజల్ గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
వింగిఫై సంస్థ వ్యవస్థాపకుడైనా పరాస్ చోప్రాకు ఇటీవల ఉద్యోగం కోసం ఓ వ్యక్తి అప్లికేషన్ పంపించారు. ఇందులో సదరు వ్యక్తి పేర్కొన్న అంశాలు చూసిన పరాస్ అవక్కాయ్యాడు. ఇందులో ఆ అప్లికేషన్‌లో ఏముందనేగా. ‘నేను మీ కంపెనీలో ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. మీకోసం ప్రత్యేకమైన ప్రతిపాదన తీసుకొచ్చాను. నన్ను నియమించుకుంటే నేను మొదట మీకు రూ. 40 వేలు ఇస్తాను. ఒక వారంలో నన్ను నేను నిరూపించుకోకపోతే ఉద్యోగం నుంచి తొలగించండి. అంతేకాదు నేనిచ్చిన డబ్బును కూడా మీరు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని రాసుకొచ్చారు.
దీంతో ఇది చూసిన పరాస్ ఈ వింత ప్రతిపాదనను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఇది చూసిన పలువురు నిజంగానే భలే ఐడియా వేశాడని సదరు అభ్యర్థిని ప్రశంసిస్తే.. మరికొందరు మాత్రం ఇదే పద్ధతి అంటూ కామెంట్స్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..