
ఎన్విడియా (NVIDIA) సహ వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్ గురించి ఓ సంచలన విషయం బయటకు వచ్చింది. సాధారణంగా ఉద్యోగులను ప్రోత్సహిస్తూ, తన విజయాల వెనుక టీమ్ కృషి ఉందని చెప్పే ఆయన ఓ సమావేశంలో సహనం కోల్పోయారు. ఏకంగా 30 మందికి పైగా ఉద్యోగుల ముందే తన సీనియర్ ఎగ్జిక్యూటివ్ జే పూరీపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నువ్వు చనిపోతేనే మాకు ప్రశాంతత’ అనే అర్థం వచ్చేలా ఘాటు వ్యాఖ్యలు చేసారు. దీంతో అక్కడున్న ఉద్యోగులంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది? జెన్సన్ హువాంగ్ అంతలా ఎందుకు కోపగించుకున్నారు? మరోవైపు ఆయనకు మద్దతుగా లక్ష మందికి పైగా సంతకాలు ఎందుకు చేస్తున్నారు?
ఓ క్లోజ్డ్ డోర్ సమావేశంలో జెన్సన్ హువాంగ్ తన సీనియర్ ఎగ్జిక్యూటివ్ జే పూరీపై తీవ్రంగా మండిపడ్డారని న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రచురించింది. ఆ సమావేశంలో 30 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జే పూరీని ఉద్దేశించి హువాంగ్ చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారిని షాకయ్యేలా చేసాయి. ‘నీకు ఫ్లూ రావాలని అది మరింత తీవ్రమవ్వాలని కోరుకుంటున్నాను. నువ్వు చనిపోతే మాకందరికీ ఈ బాధ తప్పుతుంది’ అని హువాంగ్ అన్నారు. హువాంగ్ ఉద్యోగులపై గట్టిగా అరవడం కొత్తేమీ కాదని, అయితే జే పూరీని ఉద్దేశించి ఇలాంటి మాటలు అనడంతో సమావేశంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయిందని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. అక్కడున్న వారంతా షాకవ్వడంతో ఎవరూ మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది.
జెన్సన్ హువాంగ్ ప్రవర్తనపై గతంలోనూ కొన్ని విమర్శలు వచ్చినట్లు తెలుస్తోంది. ‘ది థింకింగ్ మెషిన్’ అనే పుస్తక రచయిత స్టీఫెన్ విట్ హువాంగ్ వ్యక్తిత్వం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బయటకు హువాంగ్ చాలా వినయంగా కనిపించేవారని, తన దగ్గర పనిచేసే ఉద్యోగులను ప్రశంసించేవారని విట్ అన్నారు. గతంలో తాను డిష్వాషర్గా పనిచేసిన రోజులను గుర్తుచేసుకోవడం, డెన్నిస్ రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు అక్కడి సిబ్బందికి భారీగా టిప్స్ ఇవ్వడం వంటి విషయాలను ప్రస్తావిస్తారట. అయితే, ఈ వినయం వెనుక మరో కోణం ఉందని విట్ విమర్శించారు. తన అభిప్రాయాలతో ఎవరైనా విభేదించినా, చిన్న విషయాల్లో ప్రశ్నించినా హువాంగ్ తీవ్రంగా స్పందించేవారని తెలిపారు. తన మాటకు ఎదురుచెప్పేవారిపై సహనం కోల్పోయి గట్టిగా అరిచేవారని తన రచనలో రాసుకొచ్చారు.
ఈ వ్యవహారంలో వార్తల్లో నిలిచిన జే పూరీ సాధారణ ఉద్యోగి కాదు. ఎన్విడియాలో అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వహించిన సీనియర్ ఎగ్జిక్యూటివ్. 2005లో వరల్డ్‌వైడ్ సేల్స్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్‌వైడ్ ఫీల్డ్ ఆపరేషన్స్ స్థాయికి ఎదిగారు. అనంతరం ఆ ఎగ్జిక్యూటివ్ పదవి నుంచి తప్పుకున్నారు.
ఎన్విడియాలో చేరకముందు సన్ మైక్రోసిస్టమ్స్ సంస్థలో దాదాపు 22 ఏళ్లపాటు పనిచేశారు. సేల్స్, మార్కెటింగ్, జనరల్ మేనేజ్మెంట్ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాదు హ్యూలెట్ ప్యాకర్డ్ (HP), బూజ్ అలెన్ అండ్ హామిల్టన్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ వంటి ప్రముఖ సంస్థల్లోనూ పనిచేశారు. ఇంతటి అనుభవం ఉన్న వ్యక్తితో హువాంగ్ సమావేశంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఓవైపు హువాంగ్ ప్రవర్తనపై విమర్శలు వినిపిస్తుంటే మరోవైపు ఆయనకు మద్దతుగా ఆన్లైన్లో భారీ ప్రచారం జరుగుతోంది. ఎన్విడియా బోర్డు ఆయనను తిరిగి సీఈఓగా నియమించాలని కోరుతూ ‘స్టాండ్ విత్ జెన్సన్’ పేరుతో ఓ పిటిషన్ ప్రారంభించింది. ఈ పిటిషన్లో ఇప్పటివరకు 1,33,326 మంది సంతకాలు చేసారు. వీరిలో 6,667 మంది ప్రస్తుత ఎన్విడియా ఉద్యోగులు, 1,251 మంది మాజీ ఉద్యోగులు, 72,265 మంది వాటాదారులు, మరో 53,143 మంది ఇతర మద్దతుదారులు ఉన్నారు. ఎన్విడియాకు 33 ఏళ్లపాటు నాయకత్వం వహించిన హువాంగ్ను తిరిగి నియమించాలని, ఆయన వైదొలగడానికి లేదా తొలగింపునకు సంబంధించిన పరిస్థితులపై స్పష్టత ఇవ్వాలని పిటిషన్లో కోరారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కూడా డిమాండ్ చేశారు.
ఈ ఆన్లైన్ ప్రచారానికి టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తన మద్దతును సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. రీప్లిట్ సీఈఓ అమ్జద్ మసద్, ఎపిక్ గేమ్స్ సీఈఓ టిమ్ స్వీనీ వంటి ప్రముఖులు కూడా ఈ ప్రచారానికి మద్దతు తెలిపారు. జెన్సన్ హువాంగ్ చుట్టూ ఇప్పుడు వ్యక్తిత్వం, నాయకత్వ శైలి, సంస్థలోని అంతర్గత వ్యవహారాలపై చర్చ మొదలైంది. ఒకవైపు ఆయనపై వచ్చిన సంచలన ఆరోపణలు మరోవైపు ఆయనకు మద్దతుగా సాగుతున్న భారీ ప్రచారం ఈ వ్యవహారం టెక్ ప్రపంచంలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.