
ఈ సంవత్సరం, టైమ్ మ్యాగజైన్ 2025 సంవత్సరానికి గానూ ప్రపంచంలోని ఖరీదైన ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. ఇందులో భారతదేశంలోని రెండు ప్రదేశాలకు ప్రధాన్యత దక్కింది. హోటళ్ళు, క్రూయిజ్‌లు, రెస్టారెంట్లు, మ్యూజియంలు, పార్కులు మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. కాగా, ఈ సంవత్సరం భారతదేశం నుండి రెండు హోటళ్ళు, ఒక రెస్టారెంట్ జాబితాలో చోటు సంపాదించాయి. అవును మన దేశంలోని రెండు హోటళ్ళు తమ పేరును ప్రపంచ పటంలో ప్రత్యేకించి లిఖించుకున్నాయి. అవి ప్రపంచంలోకెల్లా అత్యంత విలాసవంతమైన ప్రదేశాల జాబితాలోకి చేరుకున్నాయి. బాంధవ్‌గఢ్‌లోని రాఫెల్స్ జైపూర్, ది ఒబెరాయ్ వింధ్యవిలాస్ వైల్డ్‌లైఫ్ రిసార్ట్‌లు ‘గ్రేటెస్ట్ ప్లేసెస్’ విభాగంలో ర్యాంక్ పొందాయి. వీటన్నింటితో పాటు ముంబైలోని పాపాస్ రెస్టారెంట్ సందర్శించవలసిన ప్రదేశంగా గుర్తింపును పొందింది.
రాఫెల్స్ జైపూర్ :
ఇది జైపూర్‌లోని అత్యంత విలాసవంతమైన హోటల్. దీనిని 2024 లో ప్రారంభించారు. చేతితో చెక్కిన పాలరాయి పని, మొఘల్ శైలి తోరణాలతో ఈ ప్రదేశాన్ని అద్భుతంగా నిర్మించారు. ఈ 50 గదుల హోటల్ లో పాలరాయి శిల్పాలు, మొఘల్ శైలి తోరణాలు, జాలిస్ అని పిలువబడే చిల్లులు గల లాటిస్ వర్క్ స్క్రీన్ లు, ప్రత్యేకమైన సంప్రదాయ అద్దాలు, మొజాయిక్ ఫ్లోర్ తో కూడిన దీని డిజైన్ ఓ కళాఖండం అని చెబుతారు. ఈ హోటల్‌లో ఒక రాత్రికి అద్దె రూ. 55,000 ఉంటుందని చెబుతున్నారు. అయితే, ఇది ఆయా సీజన్‌ను బట్టి మారవచ్చు. ఇందులో ఆరావళి పర్వతాలను చూసే రూఫ్ టాప్ ఇన్ఫినిటీ పూల్, స్పా, నాలుగు డైనింగ్ హాల్స్ కూడా ఉన్నాయి.
ఒబెరాయ్ వింధ్యవిలాస్ వైల్డ్ లైఫ్ రిసార్ట్:
21 ఎకరంలో విస్తరించి ఉన్న ఒబెరాయ్ వింధ్యవిలాస్ వైల్డ్‌లైఫ్ రిసార్ట్‌కు కూడా ఈ జాబితాలో స్థానం లభించింది. ఇది మధ్యప్రదేశ్ లోని ప్రసిద్ధ బంధవ్ గఢ్ నేషనల్ పార్క్ సమీపంలో ఉంది. ఈ అభయారణ్యం అక్కడి సఫారీలకు చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మీరు ఫేమస్ రాయల్ బెంగాల్ టైగర్లను వాటి సహజ ఆవాసాలలో చూడవచ్చు. ఈ హోటల్ అతిథులకు వివిధ వన్యప్రాణులకు సంబంధించిన అనుభవాలను అందిస్తుంది. ఇక్కడ ఒక రాత్రి బసకు అద్దె దాదాపు రూ.40,000వరకు ఉంటుందని సమాచారం.
పాపాస్ రెస్టారెంట్:
ఈ హోటల్‌లో 8 సీట్ల బుష్ కిచెన్, ఓపెన్-ఎయిర్ రెస్టారెంట్ ఉన్నాయి. ఈ 12 సీట్ల చెఫ్ కౌంటర్ డైనింగ్‌ను ప్రఖ్యాత చెఫ్ హుస్సేన్ షాజాద్ నిర్వహిస్తున్నారు.