Viral: ముఖం వాపుతో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి.. పరీక్షలు చేసి ఆశ్చర్యపోయిన వైద్యులు

ముఖం వాపు… చూపు మందగింపులో ఓ వ్యక్తి ఆస్పత్రికి వచ్చాడు. పరీక్షలు చేయగా వైద్యులు ఆశ్చర్యపోయే విషయాన్ని కనుగొన్నారు. పాట్నాలోని IGIMS‌లో డాక్టర్లను ఆశ్చర్యపరిచిన అరుదైన కేసు. ఏమి కనుగొన్నారు? ఎలా పరిష్కరించారు? పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం ...

Viral: ముఖం వాపుతో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి.. పరీక్షలు చేసి ఆశ్చర్యపోయిన వైద్యులు
Doctors

Updated on: Aug 15, 2025 | 2:15 PM

వైద్యుల్నే ఆశ్చర్యానికి గురి చేసిన అరుదైన కేసు ఇది. బీహార్‌లోని ఇందిరా గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (IGIMS)లో వెలుగుచూసింది. సివాన్‌ జిల్లాకు చెందిన 45 ఏళ్ల రవి కుమార్‌ (పేరు మార్చాం) గత కొద్ది నెలలుగా ముఖం వాపు, చూపు మందగించడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. లక్షణాలు తీవ్రరూపం దాల్చడంతో కుటుంబ సభ్యులు ఆయనను IGIMS‌కు తీసుకువచ్చారు. ప్రాథమిక పరీక్షల్లో వైద్యులు ఆశ్చర్యపోయే అంశాన్ని గుర్తించారు. రోగి కంటికి కింద ఉన్న ఎముకలో ఒక పన్ను కూరుకుపోయి ఉంది. ఆ పన్ను వేర్లు కంటి గూటి (ఆర్బిట్‌) లోపలికి చేరాయి. వైద్య శాస్త్రంలో “Tooth in the Eye”గా పిలిచే ఈ పరిస్థితి అత్యంత అరుదు అని డాక్టర్లు చెబుతున్నారు.

ఈ కేసును IGIMS డెంటల్‌ విభాగం ఓరల్‌ మెడిసిన్‌ అండ్‌ రేడియాలజీ హెడ్‌ డాక్టర్‌ నిమ్మి సింగ్‌ పర్యవేక్షించారు. కేసు క్లిష్టతను దృష్టిలో ఉంచుకుని ఆమె మ్యాక్సిలోఫేషియల్‌ యూనిట్‌ నుంచి డాక్టర్‌ ప్రియంకర్‌ సింగ్‌, అనస్థీషియా నిపుణులు కలిపిన స్పెషల్ ఆపరేషన్ టీంను ఏర్పాటు చేశారు. అత్యాధునిక CBCT స్కాన్‌తో పన్ను ఖచ్చితమైన స్థానం, లోతు నిర్ధారించారు. ఫలితాల్లో ఆ పన్ను కంటి గూటి దిగువ భాగం (ఆర్బిటల్‌ ఫ్లోర్‌)లో బలంగా ఇరుక్కుపోయి ఉన్నట్లు తేలింది. కంటికి దెబ్బ తగలకుండా జాగ్రత్తగా గంటలపాటు శస్త్రచికిత్స జరిపి పన్నును విజయవంతంగా తొలగించారు. ఆపరేషన్‌ అనంతరం రోగి చూపు మంచిగా అయింది. అంతేకాదు ముఖ వాపు కూడా తగ్గిపోయింది.

“సాధారణంగా పళ్లు నోటిలోనే ఏర్పడతాయి. కానీ ఈ రోగిలో పన్ను కంటికి కింద పెరగడం చాలా అరుదైన విషయం” అని డాక్టర్‌ నిమ్మి సింగ్‌ తెలిపారు. శస్త్రచికిత్స విజయవంతం కావడంతో IGIMS డైరెక్టర్‌ డాక్టర్‌ బిందే కుమార్‌, డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ విభూతి ప్రసన్న సిన్హా, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మణీష్‌ మందల్‌.. ఆపరేషన్ చేసిన టీంను అభినందించారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..