
రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు సేవలు అందించాల్సిన సిబ్బంది, ఒక్కోసారి వారి పట్ల ఎంత దురుసుగా ప్రవర్తిస్తారో చాటిచెప్పే ఘటన పంజాబ్‌లోని జలంధర్ సిటీ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. ప్రభుత్వ సేవలలో పారదర్శకత, డిజిటల్ చెల్లింపులు పెరగాలని ప్రభుత్వం కోరుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని తాజా ఘటన నిరూపించింది. కేవలం చిల్లర లేదనే చిన్న కారణంతో ఒక మహిళా ఉద్యోగిని ప్రయాణికుడితో గొడవకు దిగడమే కాకుండా, తన విధులను పక్కన పెట్టి అతన్ని వెక్కిరించడం చర్చనీయాంశమైంది. ఒక ప్రయాణికుడు టిక్కెట్ కోసం కౌంటర్ వద్దకు వెళ్లగా, అక్కడి మహిళా క్లర్క్ చిల్లర లేదనే కారణంతో టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరించడమే కాకుండా, చాలా అహంకారంతో ప్రవర్తించింది.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక ప్రయాణికుడు తన ప్రయాణం కోసం టిక్కెట్ అడిగాడు. అయితే, టిక్కెట్ ధర చెల్లించే క్రమంలో చిల్లర (Exact Change) విషయంలో క్లర్క్‌కు, ప్రయాణికుడికి మధ్య వాగ్వాదం మొదలైంది. అతని వద్ద కచ్చితమైన చిల్లర లేకపోవడంతో, కౌంటర్లో ఉన్న మహిళా క్లర్క్ టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రయాణికుడు తన వద్ద ఉన్న నోటును తీసుకోవాలని లేదా ఆన్‌లైన్ చెల్లింపు సదుపాయం ఉందా అని అడిగినట్లు తెలుస్తోంది. కానీ, ఆమె మాత్రం చిల్లర ఇస్తేనే టిక్కెట్ ఇస్తానని భీష్మించుకుని కూర్చుంది.
దీంతో సదరు ప్రయాణికుడు ఈ తతంగమంతా తన మొబైల్‌లో రికార్డ్ చేయడం ప్రారంభించాడు. అది చూసిన ఆ ఉద్యోగిని ఏమాత్రం తగ్గకుండా, కెమెరా వైపు చూస్తూ అహంకారంతో మాట్లాడింది. నహీ దూంగీ, క్యా కరేగా? (నేను టిక్కెట్ ఇవ్వను, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో) అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. అంతటితో ఆగకుండా, ఆమె డ్యూటీలో ఉండి కూడా మొబైల్ ఫోన్ వాడుతున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ప్రజలను ఇబ్బంది పెట్టడం ఏంటి? అని కొందరు ప్రశ్నిస్తుంటే.. మరికొందరు డిజిటల్ ఇండియా నినాదాన్ని గుర్తు చేస్తున్నారు. డిజిటల్ ఇండియాలో ఇప్పటికీ చిల్లర కోసం గొడవలు పడటం సిగ్గుచేటు అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రతి టిక్కెట్ కౌంటర్ వద్ద QR కోడ్ సదుపాయం ఉంటే ఇలాంటి చిల్లర గొడవలు ఉండవు కదా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజలతో ఎలా ప్రవర్తించాలో నేర్పించే బిహేవియరల్ ట్రైనింగ్ అవసరమని అభిప్రాయపడుతున్నారు.
వీడియో ఇక్కడ చూడండి…
Extremely poor behavior by the female ticket staff at Jalandhar Railway Station! They didn’t return the change money, instead threatened to call the RPF, and then didn’t even give the ticket. This is straight-up a robbery-like atmosphere.
pic.twitter.com/bEaSKlThF7— Ghar Ke Kalesh (@gharkekalesh) March 13, 2026
రైల్వే శాఖ (Railway Seva), రైల్వే మంత్రిని ట్యాగ్ చేస్తూ, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సదరు ఉద్యోగినిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా, రైల్వే అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ప్రభుత్వ ఆస్తులు ప్రజల సొత్తు అని, అక్కడ పనిచేసే వారు సేవకులు మాత్రమేనని ఇటువంటి సిబ్బంది గుర్తించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇలాంటి వీడియోలు వ్యవస్థపై నమ్మకాన్ని సడలిస్తాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..