
మధ్యతరగతి వారికి అత్యంత ఇష్టమైన షాపింగ్ గమ్యస్థానం డీమార్ట్. నాణ్యమైన వస్తువులను తక్కువ ధరలకు అందిస్తుండడంతో.. చాలా మంది అవసరం ఉన్నా లేకపోయినా డబ్బులు పెట్టి కొనేస్తుంటారు. అయితే ఇలాంటి అలవాటున్న తన భర్తను అదుపు చేయడానికి ఒక మహిళ పంపిన మెస్సేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో trave with raghava అకౌంట్ హ్యాండిల్లో షేర్ అయ్యింది. స్ట్రిక్ట్ వైఫ్ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు.
రాఘవ డీమార్ట్‌లో కిరాణా సామాను కొనేందుకు వెళ్లగా, అతని భార్య తేజశ్రీ.. అతడికి సరుకుల లిస్ట్ ఇచ్చింది. అయితే ఆ లిస్ట్ వెనక ఒక ప్రత్యేకమైన సందేశాన్ని రాసింది. “నువ్వు లిస్ట్‌లో లేని వేరే ఏ వస్తువు తీసుకొస్తే.. నిన్ను ఇంట్లోకి రానివ్వను అని రాసింది. ఈ విషయం గురించి రాఘవ తన ఫ్రెండ్‌తో ‘‘తేజు రాసిన లిస్ట్ ఇదే. నేను డీమార్ట్‌కి వచ్చిన ప్రతిసారీ, కొన్నిసార్లు నాకు ఇష్టం లేనివి, అనవసరమైనవి కూడా కొంటాను. అందుకే ఆమె ఈ విధంగా రాసి పంపింది’’ అని నవ్వుతూ తన స్నేహితుడికి చెప్పాడు.
నిజానికి డీమార్ట్‌లో తక్కువ ధరలు, ఆకర్షణీయమైన అదనపు డిస్కౌంట్‌లు ఉండడంతో కస్టమర్‌లు అవసరం లేని వస్తువులను కూడా కొనుగోలు చేస్తుంటారు. ఇంటికి తెచ్చాక ఆ వస్తువులను ఏమి చేయాలో తెలియక తల పట్టుకుంటారు. ఈ అలవాటును అదుపు చేయడానికే ఆమె భర్తకు ఈ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చిందని నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.