ఓ కాలువ దగ్గరలో ఘాటైన వాసన రావడాన్ని గమనించిన స్థానికులు.. అనుమానంతో అక్కడికి వెళ్లి చూశారు. వారికి ఆ ప్రదేశంలో ఒళ్లు గగుర్పొడిచే సీన్ కనిపించింది. ఇంకేముంది దెబ్బకు దడుసుకున్నారు. లగెత్తుకెళ్లి పోలీసులకు సమాచారం అందించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లో మీరట్ కంటోన్మెంట్ ప్రాంతంలోని ఓ కాలువ వద్ద నగ్నంగా తల లేని ఓ మహిళ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో స్థానికులకు కనిపించింది. వీధికుక్కలు ఆ మృతదేహాన్ని లాగుతుండగా గుర్తించిన జనం.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారాన్ని అందుకున్న పోలీసులు హుటాహుటిన స్పాట్‌కు చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ‘ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యకు పాల్పడ్డారు. మృతురాలి ఐడెంటిటీ తెలియకుండా ఉండేందుకు అత్యంత కిరాతకంగా చంపారు. సమీపంగా ఉన్న పోలీస్ స్టేషన్లలో ఏమైనా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయో.? లేదో.? అనే విషయాలు తెలుసుకుంటున్నాం. శరీరం కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో వల్ల వయస్సును గుర్తించడం కొంచెం కష్టమే. పోస్టుమార్టం నివేదిక అనుగుణంగా విచారణలో ముందుకు వెళ్తామని అడిషనల్ చంద్రకాంత్ మీనా తెలిపారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల హర్యానాలోని ఫతేహాబాద్‌లో ఇలాంటి తరహా కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. మోను(21) అనే వ్యక్తి తన స్నేహితుడి చేతుల్లోనే అత్యంత కిరాతకంగా చంపబడ్డాడు. మృతుడి డెడ్ బాడీ తల లేకుండా ఓ ప్రైవేటు పాఠశాల వెనుక గొయ్యిలో పూడ్చిపెట్టారు. ఇద్దరి మధ్య డబ్బు లావాదేవీల్లో వివాదం తలెత్తడం వల్లే ఈ ఘోరం జరిగిందని పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.