
కిలేడీ పెళ్లికూతురు కథలు చాలానే విని ఉంటాం. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటూ.. అమాయకులను బురిడీ కొట్టిస్తుంది ఈ కిలేడీ. ఇలాంటి దొంగ వధువుల బారిన చాలామంది వ్యక్తులు చిక్కుకున్నారు. ఇక ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో ఈ తరహ కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. పెళ్లి జరిగి.. రెండేళ్ల తర్వాత ఫస్ట్ నైట్ రోజున ఎవ్వరికీ చెప్పకుండా.. బంగారు ఆభరణాలు, డబ్బుతో ఉదాయించింది.
వివరాల్లోకి వెళ్తే.. స్థానిక ఉంచటిల ప్రాంతానికి చెందిన రామ్ ప్రతాప్ యాదవ్‌కు రెండు నెలల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి పెళ్లికూతురు వాళ్ల తల్లిదండ్రులు ఇంటి దగ్గరే ఉంది. ఇక అతడు మే 10న, శనివారం తన భార్యను తిరిగి ఇంటికి తెచ్చుకున్నాడు. అదే రోజు రాత్రి ఫస్ట్ నైట్‌కి కూడా ఏర్పాట్లు చేశాడు. కట్ చేస్తే.! మే 11వ తేదీ తెల్లారేసరికి తన భార్య ఇంట్లో కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా దొరకలేదు. తన భార్యతో పాటు ఇంట్లోని బంగారు నగలు, అలాగే రూ. 13 వేలు కనిపించకుండాపోయాయి. దీంతో తన పెళ్లికి మధ్యవర్తిత్వం వహించిన దినేష్, శ్యాము, కుల్దీప్‌లకు ఈ విషయాన్ని తెలియజేశాడు. వారు అతడికి ఎలాంటి సహకారం అందించలేదు. దీంతో చేసేదేమిలేక పోలీసులను ఆశ్రయించాడు సదరు బాధితుడు.
తనకు రెండు నెలల క్రితం మహారాజ్‌గంజ్‌లోని ఒక గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం జరిగిందని.. మే 10న ఆమెను తన ఇంటికి తీసుకురాగా.. అదే రోజు రాత్రి భోజనం చేసిన అనంతరం. ఏం జరిగిందో తనకు తెలియదని.. మత్తుగా నిద్రపోయానని పోలీసులకు ఇచ్చిన కంప్లయింట్‌లో రాసుకొచ్చాడు. తెల్లారి నిద్ర లేచి చూసేసరికి తన భార్య, ఇంట్లో దాచిపెట్టిన బంగారు నగలు, రూ.13 వేలు కనిపించకుండా పోయాయని పేర్కొన్నాడు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.