Gender Reveal: ఆధునికత ఎంత పెరిగినా.. ఇప్పటికీ ప్రజల మనసుల మూలాల్లో కొన్ని క్రూరమైన లక్షణాలు పోవడం లేదు. ముఖ్యంగా మనిషి ఎంత శాస్త్రీయంగా అభివృద్ధి చెందినా లింగ వివక్ష విషయంలో ఆలోచనలు మాత్రం ఆదిమానవుని స్థాయిలోనే ఉండిపోతున్నాయి. సాధారణంగా గర్భవతి అయిన వారికి తమకు పుట్టబోయే బిడ్డ ఎవరనే ఆసక్తి ఉండదు. గుండె నిండుగా పుట్టబోయే బిడ్డమీద ప్రేమనే పెంచుకుంటుంది. అది ఆడపిల్ల అయినా.. మగ పిల్లవాడు అయినా ఒకటే. కానీ, పురుష పుంగవులకే.. తమకు ఏ బిడ్డ పుడుతుంది అనే ఆసక్తి ఎక్కువ. మగ బిడ్డ పుట్టాలనే కాంక్ష ఎక్కువ. అందుకోసం పుట్టబోయే బిడ్డ ఎవరు అనేది తెలుసుకోవాలని తహ తహ లాడుతూ ఉంటారు. అందులో భాగంగా ఆధునిక యుగంలో ఒకరకమైన క్రీడా నిర్వహిస్తారు. మనదేశంలో ఇది తక్కువే.. కానీ, విదేశాల్లో ఇది సర్వసాధారణమైన క్రీడ. తమకు పుట్టబోయే బిడ్డ ఆడా.. మగా.. అని తేల్చుకోవడం కోసం ఒక గేమ్ లాంటిది ఆడతారు. దీనిలో తమ స్నేహితులను, బంధువులనూ పిలిచి వారి సమక్షంలో ఈ ఆట ఆడుతారు. ఇదెలా అంటే.. కొన్ని బెలూన్లు వేలాడ దీస్తారు. ఆ బెలూన్లలో కొన్నిటిలో పింక్ కలర్.. మరి కొన్నిటిలో బ్లూ కలర్ నింపుతారు. వచ్చిన అతిథులలో ఒకరితో ఆ బెలూన్లు పగల గొట్టమని చెబుతారు. అలా పగల గొట్టిన బెలూన్ లో పింక్ కలర్ వస్తే పుట్టేది అమ్మాయి అనీ.. బ్లూ వస్తే అబ్బాయి అని నమ్ముతారు. ఇదీ ఆట. ఈ ఆట గురించి ఇప్పుడు మాకెందుకు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం.
అసలే ఇదో చెత్త ఆట. దీనిని ఒక పార్టీలో మరింత చెత్తగా జరుపుకోవడమే కాకుండా ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఆ వీడియోలో ఏముందంటే.. దుబాయ్‌లోని బుర్జ్ అల్ అరబ్ హోటల్ పక్కన ఉన్న బీచ్‌లో ఒక పులి గొలుసు లేకుండా స్వేచ్చగా తిరుగుతోంది. అక్కడ చాలామంది జనం ఉన్నారు. ఎదురుగ బెలూన్లు కట్టి ఉన్నాయి. వాటి వద్దకు చేరుకున్న పులి ఒక బెలూన్ పగల గొట్టింది. అందులోంచి పింక్ కలర్ బయటకు వచ్చింది. ఈ ఆట ప్రకారం అది ఆడపిల్లను సూచిస్తుంది. ఈ వీడియో చూసిన జంతు ప్రేమికులు విపరీతమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్థానిక నివేదికల ప్రకారం , ఈ వీడియోను కార్లోటా కావల్లారి అనే ఆమె రెండు రోజుల క్రితం ఆన్‌లైన్‌లో మొదటిసారి షేర్ చేశారు. అందులో ఆమె ఇలా క్యాప్షన్ రాసింది. . “పులికి హాని జరగలేదు. అదేవిధంగా బెలూన్ల ప్లాస్టిక్ పారవేశాం. అందరూ విశ్రాంతి తీసుకోండి” అని ఆమె రాసింది. ‘లోవిన్ దుబాయ్’ ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసిన తర్వాత ఈ వీడియో వైరల్ అయింది. దీన్ని ఇక్కడ చూడొచ్చు.
రెండు రోజుల క్రితం పోస్ట్ చేసినప్పటి నుండి, వీడియో 3 లక్షల మంది దీనిని చూశారు. 1,000 కంటే ఎక్కువ మంది కామెంట్స్ రాశారు. ఈ కామెంట్లలో చాలా మంది ఈ ఆటను విమర్శించారు.
“పూర్తిగా అసహ్యంగా ఉంది. ఈ గంభీరమైన జీవులు మీరు మీ వికృత ఆనందం కోసం దోపిడీ చేయడానికి ఈ గ్రహం మీద లేవు!” అంటూ ఒక Instagram వినియోగదారు తీవ్రంగా కామెంట్ రాశారు.
“ఇది గర్వించాల్సిన విషయం కాదు. ఈ జంతువులు పెంపుడు జంతువులు కాదు,” అని ఒక వ్యక్తి ఎత్తి చూపాడు. మరికొంతమంది వీడియోను “హాస్యాస్పదంగా” పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి: Power Crisis: బొగ్గు కొరతపై ప్రధాని మోడీ సమీక్ష.. ఆందోళన అవసరం లేదన్న కేంద్ర మంత్రి