
పర్యాటక ప్రియులు మాల్దీవులకో లేదా స్విట్జర్లాండ్ కో వెళ్లాలని కలలు కంటుంటారు. కానీ, రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్‌లో ఉన్న ఒక ప్రదేశం చూస్తే, మీరు అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదనిపిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూసి అందరూ అది విదేశీ ప్రదేశం అనుకుంటున్నారు. కానీ, అది అజ్మీర్ లోని మార్బుల్ డంపింగ్ యార్డ్. ఇది ఒక అందమైన వ్యర్థాల కుప్ప. కిషన్‌గఢ్ ఆసియాలోనే అతిపెద్ద మార్బుల్ మార్కెట్. ఇక్కడ వేల సంఖ్యలో మార్బుల్ కటింగ్ యూనిట్లు ఉన్నాయి. రాయిని కోసేటప్పుడు వచ్చే తెల్లటి పొడిని (Slurry) దశాబ్దాలుగా ఒక నిర్దేశిత ప్రాంతంలో పారబోస్తున్నారు. కాలక్రమేణా ఈ వ్యర్థాలు పేరుకుపోయి సుమారు 500-600 ఎకరాల్లో తెల్లటి కొండల్లా విస్తరించాయి. దీనిపై సూర్యరశ్మి పడినప్పుడు అది వెండిలా మెరుస్తూ మంచు కొండలను తలపిస్తుంది.
దశాబ్దాలుగా ఇక్కడ కుప్పలు కుప్పలుగా పోసిన మార్బుల్ పౌడర్ కాలక్రమేణా గడ్డకట్టి, తెల్లటి కొండల్లా మరియు మైదానాల్లా మారిపోయింది. వర్షపు నీరు ఇక్కడ చేరడంతో అది నీలి రంగులోకి మారి, మాల్దీవుల సముద్ర తీరాన్ని తలపిస్తోంది. ఈ ‘వేస్ట్ యార్డ్’ ఇప్పుడు పర్యాటకులకు, ముఖ్యంగా ప్రీ-వెడ్డింగ్ షూట్స్, ఫోటోషూట్ల కోసం అత్యంత ఇష్టమైన ప్రదేశంగా మారింది.
ఇక్కడ ఉన్న నీటి గుంటల్లో నీరు నీలి రంగులో కనిపిస్తూ మాల్దీవుల సముద్రపు నీటిని గుర్తు చేస్తుంది. ఈ అద్భుతమైన నేపథ్యం (Background) కారణంగా సినిమా షూటింగులు, మ్యూజిక్ వీడియోలు, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేసేవారికి ఇది స్వర్గధామంగా మారింది. ఎంతో మంది జంటలు తమ ప్రీ-వెడ్డింగ్ షూట్స్ కోసం ఇక్కడికి తరలివస్తున్నారు. ఒక వ్యర్థాల కుప్ప ఇంత అందంగా మారుతుందని ఎవరూ ఊహించలేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
ఇది చూడటానికి ఎంత అందంగా ఉన్నా, ఇది రసాయనిక వ్యర్థాల కుప్ప అని మర్చిపోకూడదు. ఇక్కడి ధూళి వల్ల శ్వాసకోస సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం కూడా దీనిని ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే ఆలోచనలో ఉంది. ఒకప్పుడు పారిశ్రామిక వ్యర్థంగా భావించిన ఈ ప్రాంతం, ఇప్పుడు రాజస్థాన్ పర్యాటకానికి ఒక కొత్త ఆకర్షణగా నిలిచింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..