
కృషి, పట్టుదల ఉంటే సోషల్ మీడియా ద్వారా సాధారణ వ్యక్తులు కూడా రాత్రికి రాత్రే ఏ స్థాయికి ఎదుగుతారో నిరూపించారు జార్ఖండ్‌కు చెందిన రాజేష్ రావణి. సుమారు 25 సంవత్సరాలకు పైగా దేశవ్యాప్తంగా ట్రక్ నడుపుతూ నెలకు 25-30 వేల రూపాయల ఆదాయంతో జీవనం సాగించిన ఆయన, నేడు యూట్యూబ్‌లో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుని నెలకు రూ. 5 నుంచి 10 లక్షల వరకు అర్జిస్తున్నారు.
రాజేష్ రావణి తన సుదీర్ఘ ప్రయాణాలలో రహదారుల పక్కన వంట చేసుకోవడం, ట్రక్ డ్రైవర్ల కష్టసుఖాలు, వారి జీవనశైలిని వీడియోలు తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం ప్రారంభించారు. ఆయన సాధికారికమైన మాటతీరు, వంట చేసే విధానం వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఆయన యూట్యూబ్ ఛానెల్ కు 1.8 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ప్రతిష్టాత్మక పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా గతంలో ఈయన వీడియోను రీట్వీట్ చేస్తూ ప్రశంసల వర్షం కురిపించారు.
యూట్యూబ్ ద్వారా వచ్చిన సంపాదనతో ఆయన తన కలను నెరవేర్చుకున్నారు. సాధారణంగా మన దేశంలో ట్రక్కులు ప్రాథమిక వసతులతో మాత్రమే ఉంటాయి. కానీ, రాజేష్ రావణి తన సరికొత్త ట్రక్‌ను అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ఫీచర్లతో రీడిజైన్ చేయించారు. సుదీర్ఘ ప్రయాణాల్లో హాయిగా పడుకోవడానికి ఏసీ సౌకర్యంతో కూడిన డబుల్ బెడ్. సొంతంగా వంట చేసుకోవడానికి ప్రత్యేకమైన కిచెన్ స్పేస్, రిఫ్రిజిరేటర్. అడ్వాన్స్‌డ్ మ్యూజిక్ సిస్టమ్, పవర్ పాయింట్స్, విలాసవంతమైన ఇంటీరియర్ సీటింగ్ వంటివి ఏర్పాటు చేసుకున్నాడు.
యూట్యూబ్ ఆదాయంతో ఇప్పటికే తన సొంత ఊరిలో ఒక పెద్ద ఇంటిని నిర్మించిన రాజేష్, ఇప్పుడు ఈ లగ్జరీ ట్రక్ ద్వారా తన వృత్తిని మరింత ఆనందంగా కొనసాగిస్తున్నారు. వృత్తి ఏదైనా కష్టపడి పని చేస్తే విజయం ఖాయం అని చాటిచెప్పిన ఆయన విజయగాథ నేటి యువతకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..