వెజ్‌ బిర్యానీలో ఈగ.. రూ.లక్ష జరిమానా విధించిన IRCTC! అసలు ముచ్చట ఇదే

రైలులో ప్రయాణిస్తున్న ప్యాసెంజర్లకు అందించే భోజనం నాణ్యతపై మరో మారు ప్రశ్నలు తలెత్తాయి. తాజాగా ఓ రైలు ప్రయాణికుడికి అందించిన వెజ్ బిర్యానీలో ఈగ కనిపించడంతో ఐఆర్‌సీటీసీ (IRCTC) తీవ్రంగా స్పందించింది. ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు సంబంధిత క్యాటరింగ్ సంస్థపై రూ.1 లక్ష జరిమానా విధించడంతో పాటు లైసెన్స్ రద్దు చేసే అంశంపై షోకాజ్ నోటీసు జారీ చేశారు..

వెజ్‌ బిర్యానీలో ఈగ.. రూ.లక్ష జరిమానా విధించిన IRCTC! అసలు ముచ్చట ఇదే
Fly In Biryani At Rajdhani Express

Updated on: Jun 25, 2026 | 9:55 AM

న్యూఢిల్లీ, జూన్‌ 25: భారతీయ రైల్వేల్లో ప్రయాణికులకు అందించే ఆహార నాణ్యతపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. అహ్మదాబాద్-ముంబై తేజస్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి అందించిన భోజనంలో ఈగ కనిపించడంతో భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తీవ్రంగా స్పందించింది. సంబంధిత క్యాటరింగ్ సంస్థపై రూ.1 లక్ష జరిమానా విధించడంతో పాటు లైసెన్స్ రద్దుపై షోకాజ్ నోటీసు జారీ చేసింది. మంగళవారం (జూన్‌ 23) తేజస్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు ఆన్‌బోర్డ్ భోజనంగా కాంబో లంచ్‌ను ఎంపిక చేసుకున్నాడు. భోజనం చేస్తున్న సమయంలో వెజ్ బిర్యానీలో ఈగ కనిపించడంతో వెంటనే ఫిర్యాదు చేశాడు. ఆహార నాణ్యత కూడా సరిగా లేదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఐఆర్‌సీటీసీ అధికారులు తెలిపారు.

ప్రయాణికుడి ఫిర్యాదు అందుకున్న వెంటనే రైలు కెప్టెన్, క్యాటరింగ్ మేనేజర్ స్పందించి ఘటనపై విచారం వ్యక్తం చేశారు. భోజనాన్ని మార్చి ఇవ్వాలని ప్రతిపాదించినప్పటికీ ప్రయాణికుడు నిరాకరించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఐఆర్‌సీటీసీ, ఆహారం సరఫరా చేసిన క్యాటరింగ్ సంస్థను ఆరాహా హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్‌ను గుర్తించింది. ఈ సంస్థ సూరత్‌లోని లైసెన్స్ పొందిన బేస్ కిచెన్ నుంచి ప్రయాణికులందరికీ భోజనాన్ని సరఫరా చేసినట్లు తెలిపింది. ఘటనకు ముందు జూన్ 15న బేస్ కిచెన్‌ను అధికారులు తనిఖీ చేయగా, జూన్ 18న షెడ్యూల్ ప్రకారం డీప్ క్లీనింగ్ నిర్వహించినట్లు రికార్డులు చూపుతున్నాయి. అయినప్పటికీ భోజన తయారీ, ప్యాకేజింగ్‌లో లోపాలు గుర్తించడంతో సంస్థకు హెచ్చరికలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తాజా ముడి పదార్థాల కొనుగోలు, అన్ని ఆహార పదార్థాల నాణ్యత తనిఖీ, నిల్వ కంటైనర్ల గాలి చొరబడని పరిస్థితిని క్రమం తప్పకుండా పరిశీలించాలని ఐఆర్‌సీటీసీ ఆదేశించింది. అలాగే ఆహార తయారీ, ప్యాకేజింగ్, సరఫరా ప్రతి దశలో పరిశుభ్రత, నాణ్యత నియంత్రణ చర్యలను మరింత కఠినతరం చేయాలని సూచించింది. రైల్వే మంత్రిత్వ శాఖ అధికారుల ప్రకారం భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో రోజుకు సగటున 16 లక్షల భోజనాలు ప్రయాణికులకు అందజేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు, నాణ్యమైన ఆహారం అందించేందుకు కాలానుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Follow Us