ప్రేమ పెళ్లిళ్లకు వేదికగా ఆ పార్టీ ఆఫీసులు! ప్రేమికులకు తలుపులు తెరిచే ఉంటాయని అధికారిక ప్రకటన

తమిళనాడులో పెరుగుతున్న పరువు హత్యలను అరికట్టేందుకు సీపీఎం పార్టీ కార్యాలయాలను ప్రేమ వివాహాలకు వేదికగా మార్చాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రేమికులకు భరోసా కల్పిస్తుందని పార్టీ నమ్ముతుంది. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు అండగా ఉండాలని ఆ పార్టీ నాయకులు తెలిపారు.

ప్రేమ పెళ్లిళ్లకు వేదికగా ఆ పార్టీ ఆఫీసులు! ప్రేమికులకు తలుపులు తెరిచే ఉంటాయని అధికారిక ప్రకటన
Love Marriage

Updated on: Aug 26, 2025 | 7:28 AM

చాలా వరకు పెద్దలను ఎదిరించి జరిగే ప్రేమ పెళ్లిళ్లు రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లోనో, ఆర్యసమాజ్‌లోనో లేదా గుళ్లలోనో జరుగుతూ ఉంటాయి. కానీ ఇక నుంచి ఓ రాజకీయ పార్టీ ఆఫీసులు కూడా ప్రేమ పెళ్లిళ్లలకు వేదికగా మారనున్నాయి. తమ పార్టీ ఆఫీసులు ప్రేమ పెళ్లిళ్ల కోసం సిద్ధంగా ఉంటాయంటూ, ప్రేమికుల కోసం తమ పార్టీ ఆఫీస్‌ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయంటూ స్వయంగా ఆ పార్టీ నుంచే అధికారిక ప్రకటన వెలువడింది. ఇంతకీ ఆ రాజకీయ పార్టీ ఏదంటే.. సీపీఎం. సామాజిక సంస్కరణల దిశగా తమిళనాడు సీపీఎం ఒక కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలో పెరిగిపోతున్న పరువు హత్యలకు వ్యతిరేకంగా తమ పార్టీ కార్యాలయాలను ప్రేమ వివాహాలకు వేదికగా మారుస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది.

మైలాపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.షణ్ముగం ఈ ప్రకటన చేశారు. రాష్ట్రంలో పరువు హత్యల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, ఈ దురాచారాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు అండగా నిలవాల్సిన బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పరువు హత్యలను అరికట్టేందుకు తక్షణమే ఒక కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని కూడా ఆయన కోరారు. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన వర్గాల మధ్యనే కాకుండా, కొన్నిసార్లు ఒకే సామాజికవర్గంలో కూడా పరువు హత్యలు జరుగుతున్నాయని షణ్ముగం ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రేమ జంటలకు భరోసా కల్పిస్తుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా సీపీఎం తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి